Site icon HashtagU Telugu

TRS Leader: గులాబీ ‘కీచకులు’

Trs

Trs

అధికారాన్ని అడ్డంపెట్టుకొని గులాబీ నేతలు అవినీతి అక్రమాలు, వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఈ ఘటనలు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సామాన్య పౌరులను ఇబ్బందుల పాలు చేస్తున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్న ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య, నిన్న కామారెడ్డిలో రియల్టర్, అతని తల్లి సుసైడ్ ఘటనలు మరువక ముందే, తాజాగా మరో అధికార పార్టీ నేత వార్తల్లోకి ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ సతీష్ అరోరా తీరుకు విసిగిపోయిన ఓ మహిళ సైబరాబాద్ కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. కొన్ని నెలల క్రితం సతీష్ తన ఇంటి పక్కన ఉన్న కేపీహెచ్బీ ప్రాంతంలో నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు తనను వేధించడం ప్రారంభించాడనీ ఆరోపించింది. అయితే 30 ఏళ్ల వయసున్న బాధితురాలు వేధింపులు భరించలేక ఆ ప్రాంతం విడిచి మరోచోటుకి షిప్ట్ అయ్యింది.

ఆమె అక్కడ బోటిక్ నడపడం మొదలుపెట్టింది. అయితే, సతీష్ అక్కడ కూడా వేధిస్తూనే ఉన్నాడు. ఆమెను ఇబ్బంది పెట్టాలని, బోటిక్ పక్కన ఉన్న దుకాణాల యజమానులను ప్రేరేపించాడు. సతీష్ కూడా తరచూ బాధితురాలి దుకాణం ఉన్న ప్రాంతానికి వెళ్లి, అక్కడే కూర్చుని బెదిరించేవాడు. ఖమ్మం, కామారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు ఆగడాలు వెలుగులోకి వస్తుండటంతో, చివరకు ఈ బాధితురాలు ధైర్యం తెచ్చుకుని సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్‌పై మహిళను వేధించాడనే ఆరోపణలపై కేసు నమోదైంది. సతీష్ ఓ వ్యాపారవేత్త. దాదాపు దశాబ్ద కాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేస్తున్నారు. అయితే ఈ వార్త తెలియగానే, సతీష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. గతంలో సతీష్ నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయన భార్య హేమ, డ్రైవర్ వంశీ తనను వేధించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌ తెలిపారు.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులు రెండు రోజుల పాటు అత్యాచారం (gang rape) చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి  నిందితుల్లో ఒకరిగా చెబుతున్న స్థానిక టీఆర్ఎస్ నేత కుమారుడు సహా మరొకరిని పోలీసులు  అరెస్ట్ చేశారు. వీరిని టీఆర్ఎస్ (trs) మున్సిపల్ వార్డు కౌన్సిలర్ మహ్మద్ ఖాజా (Mohd Khaja) కుమారుడు షేక్ గౌస్ పాషా (Sheik Ghouse Pasha) , అతనికి సహకరించిన సాయిరాంరెడ్డిగా ( Sairam Reddy) గుర్తించారు.  నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, టీఆర్ ఎస్ నాయకుడు షాజిద్ ఖాన్ (TRS leader Sajid Khan) 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్ నేతల తీరుపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగి, నేతలను మందలించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version