తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ (TG-AP)మధ్య రవాణా మరియు అభివృద్ధి సంబంధాలు మరింత బలపడేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్-అమరావతి (Hyderabad to Amaravati) మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం రూ.2,245 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుసంధానాన్ని బలపరచనుంది. ఇప్పటికే భూసేకరణ దాదాపు పూర్తవడంతో, టెండర్లు పిలవడానికి అధికారులు సిద్ధమయ్యారు. 2025 డిసెంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించి, ఐదేళ్లలో పూర్తిచేసేలా రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది.
కృష్ణా నదిపై 3.5 కిలోమీటర్ల భారీ వంతెన
ఈ రైల్వే మార్గంలో కృష్ణా నదిపై 3.5 కిలోమీటర్ల పొడవుతో ఓ భారీ వంతెన నిర్మించనున్నారు. అమరావతి – పరిటాల సెక్షన్ మధ్య ఈ వంతెన ఉండబోతోంది. సుమారు రూ. 600 కోట్లు ఖర్చవనున్న ఈ వంతెనను 60 స్పాన్లతో నిర్మించనున్నారు. ఈ వంతెనతోపాటు మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.2,400 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి అమరావతి వరకు రైలు ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యంగా మారుతుంది. ఇది కేవలం భౌగోళికంగా కాదు, రాజకీయంగా, పర్యాటకపరంగా కూడా రెండు రాష్ట్రాలకు లాభదాయకం.
కొత్త మార్గం గుండా అభివృద్ధి చెందనున్న గ్రామాలు
ఈ కొత్త రూట్ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై, పెద్దాపురం, పరిటాల, చెన్నారావుపాలెం, అమరావతి, కొప్పురావూరు మీదుగా నంబూరులో గుంటూరు-విజయవాడ లైన్‌తో కలుస్తుంది. మొత్తం 58 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ మార్గాన్ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. ఫేజ్-1లో నంబూరు నుంచి కొప్పురావూరు (6 కి.మీ.) మరియు కొప్పురావూరు నుంచి అమరావతి వరకు (14 కి.మీ.) నిర్మాణం జరుగుతుంది. ఫేజ్-2లో ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం (5.5 కి.మీ.), చెన్నారావుపాలెం, పరిటాల మీదుగా మరో 22 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు.
ఈ రైల్వే మార్గంలో 35 పెద్ద వంతెనలు, 95 చిన్న వంతెనలు, 3 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ (ROB), 12 రోడ్ అండర్ బ్రిడ్జెస్ (RUB) నిర్మించనున్నారు. దేశంలో లెవల్ క్రాసింగ్‌లను తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అందుకే ఈ మార్గంలో ఎక్కడా లెవల్ క్రాసింగ్ ఉండకుండా అన్ని ప్రాంతాల్లో బ్రిడ్జ్ నిర్మాణమే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, హైదరాబాద్ నుండి అమరావతి వరకు నేరుగా వెళ్లే వేగవంతమైన రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, ఈ మార్గంలోని గ్రామాలకు అభివృద్ధి వేదికగా నిలవనుంది.