Site icon HashtagU Telugu

Telangana Government: తెలంగాణ‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

CM Revanth

CM Revanth

Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం (Telangana Government) మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలకు ఎన్ఐఎన్ సహకారం తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ ర‌కంగా రేవంత్ స‌ర్కార్ మ‌రో అడుగు ముందుకేసింది.

ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆహార భద్రతతో పాటు నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీయ పోషకాహార సంస్థ) సహకారం తీసుకుంటోంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (TGSWREIS) అధ్వర్యంలో రాష్ట్రంలో 268 రెసిడెన్షియల్ విద్యాసంస్థలున్నాయి. వీటిలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రతిరోజు భోజనంతో పాటు స్నాక్స్ ను అందించే కామన్ డైట్ ప్రోగ్రాంను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది.

Also Read: Budget 2025 Expectations: ఈ ఏడాది ప్రభుత్వ బడ్జెట్ ఎంత‌? నిపుణుల అభిప్రాయం ఇదే!

రాష్ట్రంలో ఇటీవల కొన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కొన్ని చోట్ల ఆహార నాణ్యత లోపించిందని ఫిర్యాదులు రావటంతో ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్ఐఎన్ సహకారంతో ఆహార భద్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంపొందించాలని నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు సరుకుల సరఫరా, ఆహారం తయారీ, వడ్డించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని పారదోలేందుకు డైట్ మెనూ, వంట పద్ధతుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత ప్రమాణాలు పాటించాలని నిర్ణయించింది. వంట గదితో పాటు, స్టోర్ రూమ్, భోజనం వడ్డించే చోట నిర్దిష్టమైన పద్ధతులను (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) అనుసరించాలని సూచించింది. ఆహార నాణ్యత ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ రూపొందించేందుకు ప్రభుత్వం ఎన్ఐఎన్ సహకారం కోరింది. వీటితో పాటు సిబ్బందికి తగిన శిక్షణ మాడ్యూల్ ను అభివృద్ధి చేయాలని కోరింది.