తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లుల మంజూరుపై కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తి (Contractors are extremely dissatisfied)ని వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20 శాతం కమిషన్(20 percent commission) ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో 200 మంది కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయానికి చేరుకుని, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లూ భట్టి విక్రమార్క ఛాంబర్ (Deputy CM and Finance Minister Mallu Bhatti Vikramarka Chamber) ముందు నిరసనకు దిగారు. అయితే భట్టి విక్రమార్క వారితో మాట్లాడేందుకు సిద్ధం కాకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
ప్రభుత్వ అవినీతి బహిర్గతమైందా?
కాంట్రాక్టర్ల ఆరోపణలతో తెలంగాణలో పెరుగుతున్న కమిషన్ రాజ్ మరోసారి బయటపడినట్లయింది. గతంలో ప్రధాని మోడీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్ఆర్ ట్యాక్స్ (రాహుల్, రేవంత్) పేరిట అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే ఆరోపణలను బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు పదేపదే చేస్తూ వస్తున్నారు. తాజాగా సచివాలయానికి చేరుకుని కాంట్రాక్టర్లు 20% కమిషన్ ఇచ్చాకే బిల్లులు క్లియర్ అవుతున్నాయని ఆరోపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రతిపక్షాల విమర్శలు – ప్రభుత్వ స్పందన
కాంట్రాక్టర్లు మల్లూ భట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట నిరసనకు దిగిన తీరు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లుతోందని, మంత్రులే కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచ్‌లు, ఉద్యోగులకు బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం ఆగిపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా రాష్ట్ర ప్రతిష్ఠకు మాయని మచ్చగా మారిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
దర్యాప్తు డిమాండ్ – ప్రజా వ్యతిరేక పాలన?
ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు (CBI, ED) సుమోటోగా స్పందించి విచారణ చేపట్టాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక శాఖ ద్వారా ఎంత మొత్తం విడుదలైంది? ఎంత మంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించబడాయి? అన్న అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. పెండింగ్ బిల్లులు తీర్చేందుకు కమీషన్లు అవసరమయ్యే పరిస్థితి ప్రజా పాలనకు మచ్చ వేస్తుందని సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.