KTR Vs ACB : ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరోవైపు ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ తరుణంలో మరో అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) టెండర్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ఏసీబీకి(KTR Vs ACB) ఫిర్యాదు అందింది. దీనిపై ఏసీబీ అధికారులకు బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ లిఖితపూర్వక ఫిర్యాదును ఇచ్చారు. ఓఆర్ఆర్ టెండర్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్ టెండర్లలో క్విడ్‌ప్రోకో జరిగిందని యుగంధర్ ఆరోపించారు. ఈ టెండర్ల వ్యవహారంలో కేటీఆర్, కేసీఆర్‌లపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా యుగంధర్ గౌడ్ ఫిర్యాదు ఇచ్చారు.
Also Read : Woman Body Structure : మహిళల శరీరాకృతిపై కామెంట్ చేయడమూ లైంగిక వేధింపే: హైకోర్టు
ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ ఏసీబీ త్వరలోనే చర్యలు మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేదు. ఓఆర్ఆర్ నిర్మాణ పనుల టెండర్ల కేటాయింపుపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తామని ఇటీవలే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై సిట్ సమగ్ర దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విచారణ జరపాలని స్వయంగా బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కోరటం చాలా మంచి విషయమని రేవంత్ తెలిపారు. దీనిపై అసెంబ్లీలోనే హరీశ్ రావు స్పందిస్తూ సిట్ విచారణను స్వాగతిస్తున్నామని చెప్పారు.
Also Read :CBN Security : సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు..ఎందుకో..?
‘‘ఓఆర్‌ఆర్, శంషాబాద్ విమానాశ్రయం వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరిగింది. గత వైఎస్సార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణ ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల కోసం బీఆర్ఎస్ సర్కారు లీజుకు ఇవ్వడం వివాదానికి దారితీసింది. అందుకే ఓఆర్ఆర్ లీజు కేటాయింపు టెండర్లపై విచారణ జరుపుతాం’’ అని రేవంత్ ప్రకటించారు. ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారంలో ఏ1 నిందితుడిగా కేటీఆర్ ఉన్నారు. ఆయనను రేపు (గురువారం రోజు) ఏసీబీ విచారించనుంది. ఈనెల 16న ఈడీ విచారించనుంది. రేపు (గురువారం) ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో తన న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు.