తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ ఆకస్మిక మరణం సాహితీ ప్రపంచాన్ని, తెలంగాణ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే “జయ జయహే తెలంగాణ, జయహే జయహే తెలంగాణ” గీతం ద్వారా అందెశ్రీ కోట్లాది తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఈ గీతం ప్రతి ఇంటి నుంచి, ప్రతి హృదయం నుంచి మార్మోగి, ప్రజల్లో స్వీయగౌరవ భావనను నింపిందని సీఎం గుర్తుచేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య రంగానికి మాత్రమే కాదు, రాష్ట్ర సాంస్కృతిక ఆత్మకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
Flowers Plants: ఈ పూల మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు.. కనక వర్షం కురవాల్సిందే!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అందెశ్రీతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని స్మరించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర గీతాన్ని కొత్త స్వరాలతో రూపకల్పన చేసే సమయంలో అందెశ్రీతో కలిసి పనిచేసిన అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. “అందెశ్రీలో ఉన్న ఆవేశం, తెలంగాణపైనున్న అభిమానం, భాషపైనున్న ప్రేమ ఇవన్నీ కలిపే ఆయన నిజమైన తెలంగాణ కవి,” అని సీఎం అన్నారు. ఆయన సాహిత్యం కేవలం పదాల సమాహారం కాదు, అది తెలంగాణ మట్టిగంధం, పోరాట స్ఫూర్తి, గౌరవ గీతం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
“తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది” అంటూ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీ సాహిత్యం, కవిత్వం, గేయాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయని, స్వరాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, “తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు రాసిన కవి అందెశ్రీని రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదు” అని ముఖ్యమంత్రి అన్నారు.
