Undavalli Arunkumar : అల్లిబిల్లి రాజ‌కీయాల `ఉండ‌వ‌ల్లి`

కాంగ్రెస్ పార్టీ మేధావుల్లో ఒక‌రిగా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఉండే వాళ్లు. ద‌శాబ్దాల పాటు ఆయ‌న నెహ్రూ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - June 15, 2022 / 01:30 PM IST

కాంగ్రెస్ పార్టీ మేధావుల్లో ఒక‌రిగా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఉండే వాళ్లు. ద‌శాబ్దాల పాటు ఆయ‌న నెహ్రూ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి న‌మ్మ‌క‌స్తుడిగా మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి మెలిగారు. ఏపీలోని రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి 14 వ, 15 వ లోక్‌సభలకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అప్ప‌ట్లో ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శి సంస్థ‌ల‌ను టార్గెట్ చేయ‌డం ద్వారా రామోజీరావును విమర్శించి ఉండవల్లి 2008లో దేశ వ్యాప్తంగా వార్త‌ల్లోకి ఎక్కారు.

స‌మైక్య‌వాదాన్ని వినిపించిన ఆయ‌న నెహ్రూ కుటుంబం మీద విభ‌జ‌న వ‌ద్ద‌ని ఫైట్ చేయ‌లేక‌పోయారు. రాష్ట్రాన్ని విభ‌జించే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌ ఎంపీ ప‌ద‌విని అనుభవించారు. విభ‌జన జ‌రిగిన త‌రువాత ప్ర‌జ‌ల నుంచి వచ్చిన వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేక పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేశారు. అప్ప‌ట్లో స‌మైక్యాంధ్ర పార్టీ పెట్టిన మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి పార్టీ త‌ర‌పున 2014న పోటీ చేసి రాజ‌కీయంగా గ‌ల్లంతైన లీడ‌ర్ల‌లో ఉండ‌వ‌ల్లి ఒక‌రు. ఆ త‌రువాత కొన్నేళ్ల పాటు మౌనంగా ఉన్న ఆయ‌న ఆనాడున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై మీడియాముఖంగా ధ్వ‌జ‌మెత్త‌డం ప్రారంభించారు. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ద్ధ‌తుగా నిలిచారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలిచిన త‌రువాత ఉండ‌వ‌ల్లిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్టించుకోలేదు. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఏడాది త‌రువాత ప్ర‌భుత్వం నిల‌బ‌డ‌దంటూ లాజిక్ చెప్పారు. ఓటు బ్యాంకు 50శాతంపైగా సంపాదించుకుని అధికారంలోకి వ‌చ్చిన ఎన్టీఆర్, పీవీ ప్ర‌భుత్వాలు నిల‌బ‌డ‌లేద‌ని చెబుతూ జ‌గ‌న్ స‌ర్కార్ కూడా అంతే అంటూ సెంటిమెంట్ రంగ‌రించారు.

ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌ద్యం, ఇసుక‌, ఇళ్ల స్థ‌లాలు, సీఎంవో లో జరిగిన త‌తంగం త‌దిత‌రాల మీద మీడియాముఖంగా విమ‌ర్శించారు. ఉపాధ్యాయ , ఉద్యోగుల ధ‌ర్నాలు, పోల‌వ‌రం, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ, ప్ర‌త్యేక‌హోదా అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఏపీ రాష్ట్రం బాగుప‌డాలంటే ప‌వ‌న్ లాంటి సీఎం కావాల‌ని ఒకానొక సంద‌ర్భంలో విశ్లేష‌ణ చేశారు. డిపాజిట్లు రాక‌పోయిన‌ప్ప‌టికీ వెంట‌నే తానున్నానంటూ రాజ‌కీయ తెర‌మీద నిల‌బ‌డిన జ‌న‌సేనాని శ‌భాష్ అంటూ కితాబు ఇచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేర‌కు బీజేపీపై ఫైట్ చేయ‌డానికి సిద్థం అంటూ ప్ర‌గ‌తిభవ‌న్ మంత‌నాల్లో కీల‌కంగా మారారు. అంతేకాదు, ఏపీలోని టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల‌ను బీజేపీ ఖాతాలో వేశారు. ఇప్పుడు బీజేపీని ఎదుర్కొవ‌డానికి వ‌స్తోన్న కేసీఆర్ కు మ‌ద్ధ‌తంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు. ఆయ‌న పెట్ట‌బోయే భార‌త రాష్ట్రీయ స‌మితి గురించి ప్ర‌స్తావించ‌లేదంటూనే బీజేపీకి వ్య‌తిరేకంగా ఎవ‌రు పోరాడిన సై అంటూ ప‌రోక్షంగా కేసీఆర్ బాట ప‌ట్టారు.

జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఉండాల‌ని ఇటీవ‌ల కేసీఆర్ త‌ల‌పోశారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తోన్న ఆయ‌న వివిధ రాష్ట్రాల్లోని మేధావి వ‌ర్గానికి చెందిన వాళ్ల‌ను క‌లుసుకుంటున్నారు. ఇదంతా పీకే రూట్ మ్యాప్ ప్ర‌కారం జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలోనే ఉండ‌వ‌ల్లికి ఏపీ త‌ర‌పున కేసీఆర్ నుంచి ఆహ్వానం వెళ్లింది. పైగా కేసీఆర్‌, ఉండ‌వ‌ల్లి భేటీలో ప్ర‌శాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే, రాబోవు రోజుల్లో కేసీఆర్ పెట్ట‌బోయే బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఉండ‌వ‌ల్లి అధ్య‌క్షునిగా ప‌నిచేస్తుందేమో అని భావించే వాళ్లు లేక‌పోలేదు. అదే జ‌రిగితే, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చేస్తాన‌న్న ప‌వ‌న్ కూడా బీఆర్ఎస్ పార్టీ తో న‌డ‌వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఎందుకంటే, ఏపీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు 2018 నుంచి హైద‌రాబాద్ కేంద్రంగా జ‌రుగుతోన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.