Site icon HashtagU Telugu

Amul In TS:తెలంగాణ‌లోకి అడుగుపెడుతున్న అమూల్‌..సౌత్ ఇండియాలో అదిపెద్ద ప్లాంట్ ఇదే.. ?

Fhxq6p7vqaanco9 Imresizer

Fhxq6p7vqaanco9 Imresizer

డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణ‌లో అడుగుపెట్ట‌నుంది. ఇప్ప‌టికే ఏపీలో పెట్టుబ‌డి పెట్టిన అమూల్ తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని, అనేక అనుబంధ పరిశ్రమలకు అవకాశాలను కల్పిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి క‌ల్వ‌కుంట తార‌క‌ రామారావు తెలిపారు.

సబర్‌కాంత జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ – సబర్ డెయిరీ, అమూల్ పాల సహకార సంఘాల ఎండీ బాబుభాయ్ ఎం పటేల్, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ లు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు ఎంవోయూపై సంతకాలు చేశారు. తెలంగాణలోని ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త ప్లాంట్‌లో ఫేజ్ 1లో దాదాపు రూ.300 కోట్లు, ఫేజ్-2లో మరో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. అమూల్ తమ ప్లాంట్ రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయగలదని, ప్యాక్ చేసిన పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పెరుగు,పనీర్, స్వీట్లు వంటి విలువ ఆధారిత పాల ఉత్పత్తులను తయారు చేయడానికి 10 LLPD వరకు విస్తరించగలదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది

తెలంగాణ రైతులు, రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ సహకార సంఘాలు, ఎఫ్‌పిఓల నుండి అవసరమైన పాలు, ఇతర ముడిసరుకులను సేకరించేందుకు అమూల్ కృషి చేస్తుంది. బ్రెడ్, బిస్కెట్లు, సాంప్రదాయ స్వీట్లు, స్నాక్స్ వంటి ఉత్పత్తుల శ్రేణితో అమూల్ తెలంగాణలో తన బేకరీ ఉత్పత్తి విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన విధానం, పెట్టుబడి పర్యావరణ వ్యవస్థను చూసిన తర్వాత అమూల్ తెలంగాణలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు బాబుభాయ్ ఎం పటేల్ తెలిపారు. త్వరలో మేడ్ ఇన్ తెలంగాణ పాల ఉత్పత్తులను అందజేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబ‌డి పెడుతున్న అమూల్‌తో రాష్ట్రం మరో శ్వేత విప్లవానికి సాక్షిగా నిలుస్తోందని.. ఇది పాడి పరిశ్రమను బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.