తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ప్రణయ్ (Amrutha Pranay) హత్య కేసు (Murder Case) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరువు కోసం జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమృత ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఆమె తండ్రి మారుతీరావు ప్రణయ్(Pranay)ను హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చింది. ఈ కేసు విచారణ ఆరేళ్ల పాటు సాగగా, నల్గొండ కోర్టు మార్చి 10న కీలక తీర్పు వెలువరించింది. ఏ2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించినట్లు కోర్టు ప్రకటించింది. ఈ తీర్పు అనంతరం అమృత మీడియాకు ప్రత్యక్షంగా స్పందించకపోయినా, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Heavy Rain : తిరుపతి లో భారీ వర్షం
“నా శ్రేయోభిలాషులందరికీ.. నిరీక్షణ ముగిసింది. న్యాయం జరిగింది. నా మనసు భావోద్వేగాలతో నిండిపోయింది” అంటూ తన హృదయాన్ని బయట పెట్టింది. ఈ తీర్పు భవిష్యత్తులో పరువు హత్యలు తగ్గడానికి దోహదం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేగాక పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రణయ్ మరణం తర్వాత అమృత తన కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, మీడియా ముందుకు రాకుండా ఉండాలని నిర్ణయించుకుంది. “నా మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా కొడుకును రక్షించేందుకు ప్రెస్ మీట్‌లను నిర్వహించట్లేదు. మా ప్రైవసీని అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ స్పష్టం చేసింది. అయితే తనకు నిరంతరం మద్దతుగా నిలిచిన అనుచరులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు లేకుండా ఇది సాధ్యం కాదు. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా” అని పేర్కొంది.