Supreme Court Judgments : 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత సుప్రీంకోర్టు పలు కీలక తీర్పులను వెలువరించింది. వాటిలో అతి ముఖ్యమైన 100 తీర్పులతో వార్షిక నివేదికను ప్రధానమంత్రి నరేంద్రమోడీ విడుదల చేశారు. ఇందులో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఐదు తీర్పులకు చోటు దక్కింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read :Bapu Ghat : బాపూఘాట్ వద్ద అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం, వీల్ ఆఫ్ లైఫ్
రూ.5వేల కోట్లు విలువైన అటవీభూమిని కాపాడిన సుప్రీంకోర్టు
స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ ఖాసిమ్ కేసులో సుప్రీంకోర్టు(Supreme Court Judgments) 2024 ఏప్రిల్ 18న తీర్పును వెలువరించింది. విభిన్న ప్రాణుల మనుగడకు అడవులు తప్పనిసరి అని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వరంగల్ జిల్లాలోని రూ.5 వేల కోట్లు విలువైన అటవీభూమి ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా సుప్రీంకోర్టు కాపాడింది. కొంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 171/3 నుంచి 171/7ల్లో ఉన్న 106.34 ఎకరాలు అటవీ భూములేనని, వాటితో ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.
సీఆర్‌పీసీ సెక్షన్ 125 ముస్లిం మహిళలకూ వర్తిస్తుంది
మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో సుప్రీంకోర్టు 2024 జులై 8న తీర్పును వెలువరించింది. ముస్లిం మహిళలు ప్రత్యేక చట్టం కింద పెళ్లి, విడాకులు పొందినప్పటికీ.. సీఆర్‌పీసీ 1973లోని సీఆర్‌పీసీ సెక్షన్ 125 కింద భరణం కోరే హక్కు వారికి లభిస్తుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు ఈ రెండు చట్టాల్లో దేన్నయినా ఎంచుకోవచ్చని తెలిపింది.
Also Read :Eturnagaram Encounter : ఏటూరునాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
కోర్టు ధిక్కరణ చర్యలలో..
ఎస్.తిరుపతిరావు వర్సెస్ ఎం.లింగమయ్య కేసులో సుప్రీంకోర్టు 2024 జులై 22న తీర్పును వెలువరించింది. కోర్టు ధిక్కరణ కింద ఏ చర్యలు తీసుకున్నా, వాటిని ఆ ధిక్కరణ జరిగిన ఏడాదిలోపే మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. కంటెప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1974లోని సెక్షన్ 20 ఇదే చెబుతోందని గుర్తు చేసింది.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యకు పరిష్కారం
స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దావిందర్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న తీర్పును వెలువరించింది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వాలు కూడా పార్టీలుగా ఉన్నాయి.ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా కల్పించడానికి సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆమోదం తెలిపింది.దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు దశాబ్దాలుగా నలుగుతూ వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యకు తెరపడింది.
స్త్రీ ధనానికి ఏకైక యజమాని వివాహిత మహిళ
ములకాల మల్లేశ్వరరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 29న తీర్పును వెలువరించింది. స్త్రీ ధనానికి వివాహిత మహిళ ఏకైక యజమాని అని, భర్తకు హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కూతురు బతికి ఉండగా తండ్రికి కూడా స్త్రీ ధనంపై హక్కు ఉండదని తేల్చి చెప్పింది.