Hyderabad Rape : గ్యాంగ్ రేప్ పై ‘పోలీస్ ఛాలెంజ్

క‌దిలే కారులో హైద‌రాబాద్ నడిబొడ్డున జ‌రిగిన గ్యాంగ్ రేప్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది.

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 12:35 PM IST

క‌దిలే కారులో హైద‌రాబాద్ నడిబొడ్డున జ‌రిగిన గ్యాంగ్ రేప్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే దేశం విడిచి వెళ్లిపోయిన ప్ర‌ధాన నిందితుడి ఆచూకి తెలియ‌డంలేదు. మ‌రో వైపు మొత్తం ఆరుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేశామ‌ని చెబుతోన్న పోలీసులు ప‌రారైన నిందితుడి గురించి నోరు మెద‌ప‌డంలేదు. తాజాగా మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు జువైనల్ బోర్డును కోరడం ప్రాధాన్యత‌ను సంతరించుకుంది.

మైన‌ర్ల‌ను మేజ‌ర్లుగా గుర్తిస్తూ జువైన‌ల్ కోర్టు అనుమ‌తించిన సంద‌ర్భాలు చాలా అరుదు. ఆ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ పోలీసులు మాత్రం ఒక ద‌ర‌ఖాస్తు జువైన‌ల్ కోర్టుకు పెట్టుకున్నారు. ఇలాంటి గ్యాంగ్ రేప్ దిశ విష‌యంలో జ‌రిగిన‌ప్పుడు ఒకలా పోలీసులు వ్య‌వ‌హ‌రించారు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా పోలీసులు విచార‌ణ ఉంద‌ని విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. పైగా అరెస్ట్ చేసిన ఐదుగురిలో ఒక‌ర్ని చంచ‌ల్ గూడ జైలుకు పంపారు. విచార‌ణ నిమిత్తం అత‌న్ని క‌స్ట‌డీకి తీసుకునే ప్ర‌య‌త్నం పూర్తి స్థాయిలో చేయ‌లేదు. న‌లుగురు మైన‌ర్ల‌ను జువైన‌ల్ హోంకు పంపారు. దీంతో విచార‌ణ పూర్త‌యిన‌ట్టు పోలీసులు నింపాదిగా ఉన్నారు.

గ్యాంగ్ రేప్ జ‌రిగిన త‌రువాత నాలుగు రోజుల‌కు కేసు. న‌మోదు చేయ‌డం పోలీసుల విచార‌ణ మీద అనుమానం క‌లుగుతోంది. ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల కుటుంబీకుల పిల్ల‌లు గ్యాంగ్ రేప్ లో పాల్గొన్నార‌నే ఆరోపణ‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఆ విష‌యంపై సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ లేదా క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రూ స్పందించ‌డంలేదు. పెద్ద‌ల కుటుంబీకుల పిల్ల‌ల గ్యాంప్ రేప్ వ్య‌వ‌హారాన్ని బీజేపీ బ‌య‌ట పెట్టింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఫోటోలు, వీడియోల‌తో స‌హా బ‌య‌ట పెట్టారు. ప్ర‌తిగా ఆయ‌నపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింది.

ఒక వైపు విప‌క్షాల నుంచి ఒత్తిడి ఇంకో వైపు అధికార‌ప‌క్షం న‌డుమ గ్యాంగ్ రేప్ విచార‌ణ‌ను పోలీసులు స్వేచ్ఛ‌గా. చేయ‌లేక‌పోతున్నార‌ని స‌ర్వత్రా వినిపిస్తోన్న మాట‌. కేవ‌లం వారం రోజుల్లోనే ఐదు గ్యాంగ్ రేప్ లు హైద‌రాబాద్ తో పాటు చుట్ట‌ప‌క్క‌ల ప్రాంతాల్లో జ‌రిగాయి. అవిన్నీ పోలీసులకు స‌వాల్ గా మార‌గా, జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ మాత్రం వాళ్ల‌కు త‌ల‌నొప్పిగా మారింది. పైగా బాధితురాలు విదేశాల నుంచి వ‌చ్చిన అమ్మాయిగా చెబుతున్నారు. చ‌దువుకోవ‌డానికి విదేశాల నుంచి వ‌చ్చిన ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జ‌ర‌గ‌డం తెలంగాణ ప్ర‌భుత్వానికి చెర‌గ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది. పైగా నాలుగు రోజుల త‌రువాత కేసు న‌మోదు కావ‌డం కూడా కేసీఆర్ స‌ర్కార్ పై అప‌వాదు ప‌డింది. ఆ నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో దేశం విడిచి వెళ్లిపోయిన ప్రధాన నిందితుడ్ని అన్వేషించే ప్ర‌య‌త్నం కూడా పోలీసులు చేసిన దాఖ‌లాలు లేక‌పోవ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.