Amit Shah Phone Call: అర్వింద్ కు అమిత్ షా ఫోన్ కాల్.. దాడిపై సీరియస్!

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ తగ్గేదే లే అంటూ విమర్శలు, దాడులకు దిగుతున్నాయి. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా

  • Written By:
  • Updated On - November 19, 2022 / 12:23 PM IST

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ తగ్గేదే లే అంటూ విమర్శలు, దాడులకు దిగుతున్నాయి. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు ఎంపీ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతోన్నాయి. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని రాష్ట్ర బీజేపీ నేతలు ఖండిస్తోన్నారు. ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకెళ్లారు. దీంతో అర్వింద్‌కు అమిత్ షా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

అర్వింద్‌ను ఫోన్‌లో పరామర్శించిన అమిత్ షా.. దాడి వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. అధైర్య పడవద్దని, పార్టీ అండగా ఉంటుందంటూ భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నాయకురాలు డీకే అరుణతో పాటు పలువురు కీలక నేతలు అమిత్ షాను కలిశారు.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి విషయంపై అమిత్ షా అరా తీసినట్లు తెలుస్తోంది. అర్వింద్‌కు పార్టీ నుంచి మద్దతు ప్రకటించాలని, అన్ని విధాలా సహాయ సహాకారాలు అందించాలని అమిత్ షా సూచించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడి ఘటనపై నేతల సమావేశంలో అమిత్ షా సీరియస్ అయ్యారని, తీవ్రంగా స్పందించారని చెబుతున్నారు. కాగా అర్వింద్ మరోసారి స్పందిస్తూ తాను ఇందూరు నుంచి పోటీ చేస్తానని, దమ్ముంటే కవిత అక్కడనుంచే పోటీ చేయాలని సవాల్ విసిరారు.