Amit Shah : రాహుల్ స‌భ‌ను మ‌రిపించేలా ‘షా’ షో

తెలంగాణ రాష్ట్ర స‌మితికి ప్ర‌త్యామ్నాయం కోసం కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా? నేనా? అన్న‌ట్టు పోటీ ప‌డుతున్నాయి. ఆ క్ర‌మంలో రాహుల్ వ‌రంగ‌ల్ స‌భ‌కు పోటీగా అమిత్ షా స‌భ కు ఉంటుంద‌ని పోల్చుతున్నారు.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 04:54 PM IST

తెలంగాణ రాష్ట్ర స‌మితికి ప్ర‌త్యామ్నాయం కోసం కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా? నేనా? అన్న‌ట్టు పోటీ ప‌డుతున్నాయి. ఆ క్ర‌మంలో రాహుల్ వ‌రంగ‌ల్ స‌భ‌కు పోటీగా అమిత్ షా స‌భ కు ఉంటుంద‌ని పోల్చుతున్నారు. ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్ కు అమిత్ షా స‌భ‌ను చూపించాల‌ని క‌మ‌ల‌నాథులు స‌వాల్ గా తీసుకున్నారు. అందుకే, తుక్కుగూడ ఏర్పాట్ల‌ను భారీగా చేస్తున్నారు. ఐదు ల‌క్ష‌ల మందిని త‌ర‌లించే దిశ‌గా బీజేపీ కదిలింది. వరంగ‌ల్ రాహుల్ బ‌హిరంగ వేదిక‌, అమిత్ షా పాల్గొనే వేదిక సైజుల‌ను కూడా పోల్చుతూ స‌త్తా చాటేందుకు క‌మ‌ల‌ద‌ళం క‌స‌ర‌త్తు చేసింది.

వాస్త‌వంగా 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీలా ప‌డ్డ బీజేపీకి 2019 లోక్ స‌భ ఎన్నిక‌లు ప్రాణం పోశాయి. ఆ ఎన్నిక‌ల్లో న‌లుగురు ఎంపీలను గెలుచుకుని తెలంగాణ‌లో బ‌లంగా ఉన్నామ‌న్న సంకేతం బీజేపీ ఇచ్చింది. ఆ త‌రువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ఆశించిన ఫ‌లితాల‌ను సాధించ‌లేక పోయింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. దీంతో బీజేపీ తెలంగాణ‌లో నామ‌మాత్ర‌పు బ‌లంలోనే ఉంద‌ని ఆనాడు భావించారు. దానికి తోడు హుజూర్ న‌గ‌ర్, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్ల‌ను కూడా బీజేపీ పొంద‌లేక‌పోయింది. కానీ, దుబ్బాక ఎన్నిక‌ల్లో బొటాబొటీ మోజార్టీతో ఎమ్మెల్యేను ఉప ఎన్నిక‌ల్లో గెలిపించుకోగ‌లిగింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ధీటుగా నిలిచింది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ దాదాపుగా గ‌ల్లంతు అయింది. ఇక హుజురాబాద్ ఉప ఫ‌లితాలు బీజేపీకి అనుకూలంగా రావ‌డంతో ఈటెల ఎమ్యెల్యేగా గెలిచారు. ఆనాటి నుంచి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అంటూ ఫోక‌స్ అయింది. రాహుల్ వ‌రంగ‌ల్ స‌భ హిట్ అయ్యే వ‌ర‌కు కాంగ్రెస్ వెనుక‌బ‌డింద‌న్న భావ‌న ఉండేది. కానీ, ఆ స‌భ త‌రువాత టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ అనే సంకేతాన్ని తీసుకెళ్ల‌డంలో స‌క్సెస్ అయింది.

తాజాగా శ‌నివారం నాడు అమిత్ షా స‌భ ద్వారా కాంగ్రెస్ పార్టీ జోష్‌ను దెబ్బ‌తీసేందుకు భార‌తీయ‌ జనతా పార్టీ ( పెద్ద ప్రదర్శనకు సిద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నగరానికి సమీపంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశ ముగింపు స‌భ‌ను హిట్ చేయాల‌ని ప్లాన్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు ఐదు లక్షల మందిని తరలించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఇతర బిజెపి సీనియర్‌ నాయకులతో కలిసి శుక్రవారం సభా వేదిక వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. సభ భారీగా ఉంటుందని, రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకే బీజేపీ పనిచేస్తుందని తెలంగాణ ప్రజలకు షా స్పష్టమైన సందేశం ఇవ్వ‌నున్నారు. సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు.“టీఆర్‌ఎస్ నేతృత్వంలోని కుటుంబ లేదా అవినీతి ప్రభుత్వాన్ని కాదని” బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని కిష‌న్ రెడ్డి అన్నారు.

కర్ణాటక, పుదుచ్చేరి తర్వాత దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న మూడో రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుందని జోస్యం చెప్పారు. తెలంగాణపై దృష్టి పెట్టే బదులు, కేసీఆర్ దేశాన్ని నడిపించాలని పగటి కలలు కంటున్నారని, పగటి కలలు కనడానికి ఏమీ ఖర్చు కాదనీ, దీనికి ప్రజల మద్దతు అవసరం లేదని వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా ‘టీఆర్‌ఎస్ కుటుంబ పాలన’తో ప్రజలు విసిగిపోయారని, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ విషపూరిత దుష్ప్రచారం చేసిందన్నారు. కేసీఆర్ రాజకీయాలు అబద్ధాలు, మోసాలపై ఆధారపడి ఉన్నాయని, ప్రజలు ఆయన పద్దతులను చూశారని, దేశంలో ఎక్కడా లేనిపోని అసత్యాలు, బాధ్యతారాహిత్యాన్ని ప్రచారం చేసేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. కాగా, బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బీజేపీ నేతలు తెలిపారు. ప్రతి నియోజకవర్గం మరియు మండల స్థాయి నుండి పార్టీ నాయకులు సమావేశానికి ప్రజలను త‌ర‌లించ‌డం ద్వారా వ‌రంగ‌ల్ రాహుల్ స‌భ‌ను త‌ల‌ద‌న్నేలా హిట్ చేయాల‌ని క‌మ‌ల‌నాథులు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. టీఆర్ఎస్ స‌ర్కార్ ను ప‌డ‌గొట్టే ద‌మ్ము బీజేపీ మాత్ర‌మే ఉంద‌న్న సంకేతాన్ని బ‌లంగా పంపించే ప్ర‌య‌త్నం బీజేపీ చేస్తోంది.