Site icon HashtagU Telugu

Amit Shah : వాటన్నింటికీ కాలం చెల్లింది.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే.. ఖమ్మంలో అమిత్ షా

September 17

Amit Shah speech in Khammam BJP Public Event

దేశానికి నరేంద్రమోదీ(Narendra Modi) మరోసారి ప్రధానమంత్రి కావాలంటే.. తెలంగాణ(Telangana)లో ఈసారి బీజేపీ(BJP) అధికారంలోకి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. ఖమ్మం(Khammam)లో ఆదివారం నిర్వహించిన రైతు ఘోస.. బీజేపీ భరోసా కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ విమోచనం కోసం పోరాడిన సర్దార్ జమాపురం కేశవరావుకి నివాళులు అర్పించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అక్రమ, అవినీతి, కుటుంబ పాలకులు, రజాకార్ల మద్దతుతో కొనసాగుతున్న కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం మొదలైందని జోస్యం చెప్పారు.

తెలంగాణ విమోచనం కోసం నాటి తెలంగాణ యువత ప్రాణత్యాగం చేస్తే.. 9 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు రజాకార్ల పార్టీతో అంటకాగుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం, బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దక్షిణ భారతదేశపు అయోధ్యగా పేరొందిన భద్రాచలం రాములవారికి శ్రీరామనవమి రోజున పట్టువస్త్రాలు సమర్పించేందుకు కారు పార్టీకి తీరిక లేదని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. కమల పుష్పాన్ని రాములోరి పాదాలవద్ద ఉంచుతామన్నారు. ఆ తర్వాత కేసీఆర్ కు భద్రాచలం రావాల్సిన పని ఉండదన్నారు.

బీజేపీ నేతలపై దౌర్జన్యాలు చేసి, అక్రమంగా నిర్బంధించి, బెదిరిస్తే వెనక్కి తగ్గుతారని పొరబడుతున్నారని.. మా కిషన్ రెడ్డి, మా బండి సంజయ్, మా ఈటెలను అడ్డుకుంటే.. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కలలు కంటున్నారని, అలాంటి అవకాశం ప్రజలు ఇవ్వబోరన్నారు. కాంగ్రెస్ 4జీ పార్టీ, మజ్లిస్ 3జీ పార్టీ, బీఆర్ఎస్ 2జీ పార్టీలని.. వీటన్నింటికీ తెలంగాణలో కాలం చెల్లించదన్నారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్, ఒవైసీ పార్టీలతో కలవదని, ఆ రెండు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదన్నారు. రైతు, దళిత, మహిళ, యువత వ్యతిరేక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకలించే సమయం వస్తోందని, కుటుంబ పాలనకు ప్రజలు తమ ఓట్లతో బుద్ధిచెప్పాలని అమిత్ షా ఖమ్మం వేదికగా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

Also Read : TSRTC: రాఖీ పండగ సందర్భంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడపనున్న టీఎస్‌ఆర్టీసీ