Site icon HashtagU Telugu

TG : కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలది ‘ట్రయాంగిల్’ బంధం – అమిత్ షా

Amith Sha Bng

Amith Sha Bng

కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలది ట్రయాంగిల్ బంధం అన్నారు కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah). లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ భువనగిరి లోక్​సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​కు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఓట్​ ఫర్​ జిహాద్​, ఓట్​ ఫర్​ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎన్నికలని అమిత్ షా అన్నారు. కుటుంబ అభివృద్ధి, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరు అని , రాహుల్​ పిల్ల చేష్టల హామీలు, మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. తెలంగాణ(telangana)లో బీజేపీ 2019 ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచింది. కానీ ఈసారి 10 సీట్లు గెలవబోతున్నామని తెలిపారు. మూడు విడతల్లో ఇప్పటికే 200 సీట్లు గెలిచామని, మిగిలిన దశల్లో మొత్తం 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడంతో షెడ్యూల్ కులాలు, తెగల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అమిత్ షా చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రాష్ట్రంలో పది సీట్లు ఇస్తే ముస్లింల రిజర్వేషన్ తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో రాహుల్ బాబా ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ వాగ్దానాలు ఎప్పటికీ అమలు చేయదని, కానీ ప్రధాని మోదీ చెప్పింది తప్పక అమలు చేస్తారని హో మంత్రి పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కాలేదు. రైతులకు ఏటా రూ.15 వేల ఆర్థికసాయం అమలు చేయలేదు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం నెరవేర్చలేదు. వరి, గోధుమలకు రూ.500 బోనస్‌ హామీ అమలు చేయలేదు.

రైతులకు పూచీ లేకుండా రూ.5 లక్షల రుణ హామీ నెరవేరలేదు. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదు అన్నారు. ఆర్టికల్ 370ని తొలగించి కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం ఎగరేలా చేశామని షా అన్నారు. మోదీ ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి వాటిని రూపుమాపి మావోయిస్టు సిద్ధాంతాలు లేకుండా చేస్తున్నారని హోమంత్రి పేర్కొన్నారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓవైసీని నిలువరించగలవా అని షా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏబీసీ అనే పదాలకు కొత్త అర్థాలు చెప్పారు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్ అని అమిత్ షా వెల్లడించారు.

Read Also : Barron Trump : రాజకీయ ప్రవేశం చేయనున్న ట్రంప్‌ చిన్న కుమారుడు

Exit mobile version