TRS Congress Alliance : కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై `షా` సంకేతాలు

ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌లను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌ట్ట‌డం స‌ర్వ‌సాధారణం. ఆ విష‌యంలో మోడీ, షా ద్వ‌యం ముందుంటారు.

  • Written By:
  • Updated On - September 19, 2022 / 02:00 PM IST

ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌లను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌ట్ట‌డం స‌ర్వ‌సాధారణం. ఆ విష‌యంలో మోడీ, షా ద్వ‌యం ముందుంటారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు గురించి `షా` కోర్ క‌మిటీ స‌మావేశంలో ప్ర‌స్తావించార‌ట‌. అంతేకాదు, ఆ కూటమికి వ్య‌తిరేకంగా విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని బీజేపీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ విమోచ‌నదినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో రెండు రోజుల పాటు ఉన్నారు. ఆ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ్యాధికారం దిశ‌గా బీజేపీని తీసుకెళ్లేందుకు కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు బీజేపీ లీడ‌ర్ల‌కు ఇచ్చారు. వాటిలో ప్ర‌ధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు అనే అంశం కీల‌కంగా ఉంది. ఆ రెండు పార్టీలు ఇటీవ‌ల ద‌గ్గ‌ర‌వుతోన్న సంద‌ర్భాల‌ను ఆయ‌న గుర్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిన విషయాన్ని బీజేపీ తెలంగాణ‌ నేతలకు షా గుర్తు చేశార‌ట‌. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్ పొత్తు ఉంటుంద‌ని సూచాయ‌గా ఆయ‌న సంకేతాలు ఇచ్చార‌ని స‌మాచారం. కోర్ కమిటీ సమావేశానికి పార్టీ హైకమాండ్ 16 మంది నేతలను ఆహ్వానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు మంచి స్పందన రావడాన్ని గుర్తు చేస్తూ మునుగోడు ఉప ఎన్నిక, బైక్ ర్యాలీలు, ఇతర సంస్థాగత అంశాలపై సమావేశంలో చర్చించారు.

Also Read:   Niharika Konidela Turns Gangubai: గంగూబాయిగా మారిన నిహారిక.. మెగా ఫ్యాన్స్ కేక!

జాతీయ ప్రత్యామ్నాయం దిశ‌గా వెళుతోన్న కేసీఆర్ ప‌రోక్షంగా కాంగ్రెస్ పార్టీకి స‌హ‌కారం అందిస్తున్నారు. ఇటీవ‌ల ఈడీ విచార‌ణ సంద‌ర్భంగా సోనియా, రాహుల్ కు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆ మ‌ధ్య రాహుల్ పుట్టుక గురించి బీజేపీ నేత‌లు ప్ర‌స్తావించిన‌ప్పుడు సీరియ‌స్ స్పందించిన‌ కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డ్డారు. ప్ర‌శాంత్ కిషోర్ కూడా టీఆర్ఎస్ పార్టీని క‌లుపుకుని వెళ్లాల‌ని కాంగ్రెస్ కు తెలియ‌చేశారు. పొత్తుకు క‌లిసి రావాల‌ని ఇటీవ‌ల కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ దిగ్విజ‌య్ సింగ్ టీఆర్ఎస్ పార్టీకి పిలుపునిచ్చారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే 2023 అసెంబ్లీ లేదా 2024 సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్, బీజేపీ పొత్తు దిశ‌గా వెళ‌తాయ‌ని సంకేతాలు ఉన్నాయి. అదే విష‌యాన్ని అమిత్ షా కోర్ క‌మిటీలో మీటింగ్ లో చెప్పార‌ని తెలుస్తోంది. పైగా కేంద్ర నిఘా వ‌ర్గాలు, రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారాన్ని కూడా ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తును దాదాపుగా అమిత్ షా ఖ‌రారు చేస్తూ ఆ కూటమికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయాల‌ని బీజేపీ తెలంగాణ అగ్ర‌నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డం గమ‌నార్హం.