భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి (BR Ambedkar’s 134th Birth Anniversary) సందర్భంగా మంచిర్యాల (Mancherial)జిల్లాలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) , ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తో కలిసి జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించి నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజల్లో నాటేలా కీలక ప్రసంగం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ద్వారా ప్రజలకు అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు బొజ్జు నాయక్, ప్రేమసాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. “కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు అన్యాయం చేసినా సరే, నా కార్యకర్తలకు మాత్రం అన్యాయం చేయొద్దు” అని , ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయకూడదు” అంటూ హితవు పలికారు.
ప్రజా సంక్షేమం పట్ల తన ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క అన్నారు.“తెలంగాణలో ప్రజాపాలన తీసుకురావడంలో సహకరించిన ప్రజలను మేము ఎప్పటికీ మర్చిపోం” అని తెలిపారు. అలాగే కొన్ని పార్టీలు ఆర్థిక అరాచకత్వానికి పాల్పడి, కులగణన, ఎస్సీ వర్గీకరణను ఆపేందుకు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తుందనీ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ నిరంతరం శ్రమిస్తుందనీ భట్టి విక్రమార్క పేర్కొన్నారు.