Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్‌ను కోరుతూ ప్రముఖ హీరో అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు ఇవాళ విచారించింది. ఈరోజు పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌ను కూడా ధర్మాసనం పరిశీలించింది. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని కోర్టును పోలీసులు కోరారు. హైకోర్టు నుంచి ఇప్పటికే మధ్యంతర బెయిలును పొందిన అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిలును పొందే అర్హత కూడా ఉందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. దీనిపై తీర్పును జనవరి 3న వెలువరిస్తామని వెల్లడించింది. దీంతో ఇవాళే తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరవుతుందనే అల్లు అర్జున్(Allu Arjun) అంచనాలు ఫలించలేదు. దీంతో జనవరి 3న కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది ? అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేస్తుందా ? తదుపరిగా ఏం జరుగుతుంది ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :New Year First Week : హ్యాపీ న్యూ ఇయర్.. 2025 జనవరి 1 నుంచి జనవరి 7 వరకు రాశిఫలాలు
- సంధ్య థియేటర్‌లో డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షోను నిర్వహించారు. దానికి స్వయంగా అల్లు అర్జున్ హాజరయ్యారు.
- ఆ సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. రేవతి కుమారుడు శ్రీతేజ్ గాయపడ్డాడు.
- ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
- ఈ కేసులో అల్లు అర్జున్‌ను డిసెంబర్ 13న అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
- దీనిపై అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది.
- అంతకుముందు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు విధించిన రిమాండ్ గడువు ముగిసింది. దీంతో గత శుక్రవారం రోజు (డిసెంబర్ 27) అల్లు అర్జున్ వర్చువల్‌గా నాంపల్లి కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు.
- ఇదే క్రమంలో అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ కావాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇవాళ పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
- ఈ అంశంపై తీర్పును జనవరి 3కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.