Site icon HashtagU Telugu

Allu Arjun: అల్లు అర్జున్ కొంప‌ముంచుతున్న ఫ్యాన్స్, బీఆర్ఎస్‌!

Allu Arjun

Allu Arjun

Allu Arjun: తెలంగాణ‌లో మ‌రోసారి అల్లు అర్జున్ (Allu Arjun) వార్త‌ల్లో నిలిచారు. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయితే విమ‌ర్శ‌ల‌కు అనేక కార‌ణాలున్నాయంటూ రాజ‌కీయం పండితులు అంటున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత ఆయ‌న త‌న‌ను క‌ల‌వ‌టానికి వ‌చ్చిన సెలెబ్రిటీల‌ను సైతం ప్ర‌మోష‌న్ కోసం వాడేసుకున్నాడు. ఈ విష‌యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అల్లు అర్జున్ సినిమాకి వ‌చ్చి ఒక మ‌హిళా అభిమాని మృతిచెంద‌గా.. ఆమె కొడుకు చావు బ్ర‌తుకుల మ‌ధ్య కొట్లాడుతుంటే టాలీవుడ్ పెద్ద‌లు ఇలా బ‌న్నీని ప‌రామ‌ర్శించ‌టం ఏంట‌ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అంతేకాకుండా ఐకాన్ స్టార్‌ని క‌ల‌వ‌టానికి స‌మ‌యం ఉంది కానీ గాయ‌ప‌డిన చిన్నారిని చూడ‌టానికి టాలీవుడ్ నుంచి ఎవ‌రూ ముందుకు రాలేదు. ఈ అంశాల‌న్నింటిని సీఎం రేవంత్ నోటీస్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తీరు చూస్తే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది.

Also Read: Shreyas Iyer: దేశవాళీలో అయ్యర్ పరుగుల వరద.. 55 బంతుల్లో సెంచరీతో విధ్వంసం

ఫ్యాన్స్ అత్యుత్స‌హం

ఇక‌పోతే అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుద‌లైన ద‌గ్గ‌ర నుంచి ఈరోజు ప్రెస్ మీట్ వ‌ర‌కు బ‌న్నీకి మైన‌స్‌గా ఆయ‌న అభిమానులే మారార‌ని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు ప్ర‌భుత్వంతో మంచి సంబంధ‌మే ఉంది. అయితే అభిమానులే అత్యుత్స‌హం ప్ర‌ద‌ర్శించి సోష‌ల్ మీడియాలో సీఎం రేవంత్‌ను ట్రోల్ చేయడం మొద‌లుపెట్టారు. ముఖ్యంగా కొంత‌మంది అభిమానులు ప్ర‌తిరోజూ సీఎం రేవంత్ గురించి, ప్ర‌భుత్వం గురించి నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇది గ‌మ‌నించిన పోలీసులు సైతం బ‌న్నీ ఫ్యాన్స్‌కు డైరెక్ట్‌గానే వార్నింగ్ ఇచ్చారు. అయిన‌వారిలో మార్పులేదు. మార్పు రాక‌పోవ‌టంతో స్వ‌యంగా సీఎం రేవంతే అసెంబ్లీ వేదిక‌గా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

బీఆర్ఎస్ నాయ‌కుల స్పంద‌న‌

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె కుమారుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అయితే దీనికి కార‌ణం అల్లు అర్జున్ అని తెలంగాణ ప్ర‌భుత్వం బ‌లంగా న‌మ్ముతుంది. అయితే ఇదే విష‌యాన్ని రాజ‌కీయం చేయాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తుంది. బ‌న్నీ అరెస్ట్ అయినరోజు మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావులు ట్విట్ట‌ర్ వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు. అంతేకాకుండా బ‌న్నీపై ప్ర‌శంస‌లు కురిపించినంత ప‌ని చేశారు. ఆ త‌ర్వాత కొంద‌రు బీఆర్ఎస్ నాయ‌కులు బ‌న్నీ అరెస్ట్ విష‌యాన్ని ప్ర‌స్తావించి ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఓపిక ప‌ట్టిన సీఎం రేవంత్ సైతం అసెంబ్లీ వేదికగా నేడు త‌న అస‌హ‌నాన్ని, ఒక పేద కుటుంబం ప‌ట్ల ఉన్న సానుభూతిని బ‌య‌ట‌పెట్టారు.