Site icon HashtagU Telugu

MLC Kavitha: బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించండి, భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ

Kavitha Cm Revanth

Kavitha Cm Revanth

MLC Kavitha: బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర మంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా, బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ప్రస్తావించారు. అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చినట్లవుతుందని, బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిధులు దోహదపడుతాయని అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలని, అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

Exit mobile version