Site icon HashtagU Telugu

TSPSC: పేపర్ లీక్ కలకలం.. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రీషెడ్యూలు..?

TSPSC Exams Reschedule

Tspsc

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించనున్న ఉద్యోగ అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు పరీక్షలను రద్దు చేసిన కమిషన్.. మరో రెండు పరీక్షలను నిర్వహించకుండానే వాయిదా వేసింది. దీంతో పాటు వచ్చే నెలలో జరగనున్న పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే నిర్ణయించిన తేదీల్లో ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీ సమస్యతో టీఎస్‌పీఎస్సీలో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీతో పాటు ఏఈఈ, డీఏవో, ఏఈ అర్హత పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈనెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ ఆరు పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సి ఉంది. TSPSC ఇప్పటికే మరో తొమ్మిది పోస్టుల పరీక్ష తేదీలను ప్రకటించింది. లీకేజీ, రద్దు, వాయిదా క్రమంల, ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించాలి. ఈ ప్రక్రియకు నిపుణులతో సంప్రదింపులు, కొత్త ప్రశ్నపత్రాల తయారీ, ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నపత్రాల నుంచి స్వతంత్రంగా ప్రశ్నల ఎంపిక, వివిధ దశల్లో ఆమోదం, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి.

Also Read: Telangana SSC Exams : ఆన్‌లైన్‌లో తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ హాల్ టికెట్లు

ఇదంతా పూర్తి కావడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుందని అంచనా. రద్దు చేసిన పరీక్షలను ముందుగా నిర్వహించాలంటే, ఇప్పటికే షెడ్యూల్ చేసిన ఇతర పరీక్షల తేదీలను మార్చాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా రద్దు, వాయిదా పరీక్షలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ పరీక్షల షెడ్యూల్స్‌లో మార్పులు చేసి కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఈ ఏడాది జూన్ 11న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహించి ఫలితాల ప్రకటన అనంతరం మెయిన్స్ అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. షెడ్యూలు ప్రకారం జూన్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అదేనెలలో యూపీఎస్‌సీ, జేఈఈ పరీక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇప్పటికే గ్రూప్‌-4, 2 పరీక్షల తేదీలను ప్రకటించింది. వీటిని అనుకున్న సమయానికే నిర్వహించాలా? అనే విషయమై ఆలోచిస్తోంది. తొలుత గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. జులై 1న గ్రూప్‌-4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి.