Munugode Assembly bypoll: మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం..!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి (రేపు) గురువారం అత్యంత కీలకమైన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 07:09 PM IST

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి (రేపు) గురువారం అత్యంత కీలకమైన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు, అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈ ఎన్నిక కీలకం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని 298 పోలింగ్‌ కేంద్రాల్లో 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

3,366 మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించడంతో సహా ఎన్నికల సంఘం పోలింగ్ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టులో పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన ఆయన మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 47 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన పోటీ రాజ్‌గోపాల్‌రెడ్డి (బీజేపీ), టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిలకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ఉపఎన్నిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇటీవలే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా పేరు మార్చబడిన టీఆర్‌ఎస్, రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇక్కడ భారీ విజయంతో జాతీయ స్థాయికి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మునుగోడులో విజయం సాధించి టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే యోచనలో బీజేపీ ఆశలు పెట్టుకుంది. గత రెండేళ్లుగా దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో సాధించిన విజయాల నేపథ్యంలో బీజేపీ పుంజుకుంది.

1985, 1989, 1994, 2004, 2009లో మునుగోడు సెగ్మెంట్‌లో సీపీఐ విజయం సాధించడంతో వామపక్షాల కోటగా ఉంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 6న ఓట్లను లెక్కించనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.