Munugode By polls: మునుగోడు ఉపఎన్నికకు డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం అంద‌రీ చూపు మునుగోడు వైపే ఉంది. మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు ఉంటుంది..?

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 10:17 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం అంద‌రీ చూపు మునుగోడు వైపే ఉంది. మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు ఉంటుంది..? ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంది అని రాజ‌కీయ నిపుణులు, రాజ‌కీయ నాయ‌కులు ఇప్ప‌టి నుంచే అంచ‌నాలు వేస్తోన్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక‌ను న‌వంబ‌ర్ 8న‌ నిర్వ‌హించేందుకు ఈసీ క‌స‌ర‌త్తులు చేస్తోంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజరాత్ రాష్ట్రాల సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఈసీ యోచిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారులు ఆయా రాష్ట్రాలో ప‌ర్య‌ట‌నలు కూడా చేశారు.

ఆ మేరకే షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సైతం దృష్టి సారించింది. మునుగోడుకు ఫిబ్రవరి 8వ తేదీలోపు ఉపఎన్నిక పూర్తికావాల్సి ఉంది. మునుగోడులో ఇప్పటికే ఉప ఎన్నికల వాతావరణం మొదలైంది. మూడు పార్టీల నాయ‌కులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు భారీ స్థాయిలో నిర్వ‌హిస్తున్నారు. దసరా తర్వాత నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ఆయా పార్టీల నేత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. బీజేపీ ప్రకటన చేయకున్నా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే ఖరారు చేసింది. ఇక టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ప్రాథమికంగా ఖరారు చేసినా ప్రకటించలేదు. గతంలో జరిగిన పలు ఉప ఎన్నికలకు భిన్నంగా మునుగోడు ఉండనున్నది. ఈసారి మూడు పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఓటర్లను ఆకట్టుకోడానికి ప్లాన్‌లు మొద‌లుపెట్టారు. ఈ ఉపఎన్నిక‌ల్లో విజ‌యం సాధించటానికి మూడు పార్టీలు ఓటర్ల‌ను లోబ‌రుచుకోవాడానికి భారీ స్థాయిలో ఖ‌ర్చు చేస్తోన్నాయి. ఈ ఉపఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య‌ఢంకా మోగించాలని చూస్తోంది. కాంగ్రెస్ కూడా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్ప‌టికే నియోజకవర్గంలో ప‌ర్య‌ట‌న మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. షెడ్యూల్ వ‌స్తే మునుగోడులో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్క‌నుంది.