Uniform Civil Code: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై చర్చ జరుగుతుంది. యూనిఫాం సివిల్ కోడ్ ని ఎలాగైనా అమలు చేస్తామని అధికార పార్టీ బీజేపీ చెప్తుంది. అయితే ఈ కోడ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మతసంస్థలు యూనిఫాం సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తున్నాయి. మతంతో సంబంధం లేకుండా, ఎటువంటి లింగ భేదాల్లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడమే.. యూనిఫాం సివిల్ కోడ్.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, బిజెపి నేతృత్వంలోని కేంద్రం యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి మద్దతు ఇస్తారా లేదా అన్నది ప్రధానంగా చర్చకు దారి తీస్తుంది. ఈ విషయంలో తెలుగు ముఖ్యమంత్రులు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. యుసిసిపై తీసుకునే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలోని ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. తెలంగాణలోని దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ముస్లిం ఓటర్లపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
తెలంగాణాలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు, ఎంఐఎం పార్టీకి రాజకీయంగా సత్సంబంధాలు ఉన్నాయి. సీఎం కెసిఆర్, అసదుద్దీన్ ఒవైసి స్నేహపూర్వక మైత్రిని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ రెండు పార్టీలు ముస్లిం మద్దతుపై ఆధారపడి ఉన్నాయి. అయితే ఇటీవలి ఎంఐఎంలో కాస్త మార్పు కనిపిస్తుంది. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కెసిఆర్ యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు మద్దతు ప్రకటిస్తే ఎంఐఎం కచ్చితంగా బీఆర్ఎస్ కు దూరం అవుతుందనడంలో సందేశమే లేదు. అలా జరిగితే ఎంఐఎం కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధం అవుతుంది. ఏదేమైనా యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళతారో చూడాలి.
Read More: Article 370 Hearings : “ఆర్టికల్ 370 రద్దు” సవాల్ పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి విచారణ