Site icon HashtagU Telugu

Telangana Election : ఇక అందరి చూపు మూడో తేదీ పైనే

All Eyes Are On The Third Date Telangana Election Result Day

All Eyes Are On The Third Date Telangana Election Result Day

By: డా. ప్రసాదమూర్తి

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చివరి ఘట్టంగా తెలంగాణ (Telangana)లో పోలింగ్ ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. ఎవరి ప్రచారం వారు సాగించారు. పథకాలు, హామీలు, వాగ్దానాలు, వాదోపవాదాలు అన్నీ ముగిశాయి. ఇక వోటర్ మధ్యలో ఏమి ఉందో మూడో తేదీన మాత్రమే అర్థమవుతుంది. తెలంగాణ (Telangana)లో ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీల హోరా హోరీ పోరాటం అలా ఉంచి, ఈసారి డబ్బు, మద్యం పంపకాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మొత్తం దేశానికి ఈ విషయంలో తెలంగాణ (Telangana) ఈ రకమైన దారి చూపిస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఎన్నికల సందర్భంగా 700 కోట్లు పై చిలుకు అధికారులు స్వాగతం చేసుకున్నారు. ఇక బయటపడని వివరాలు ఎవరి అంచనాలకూ అందనంత దారుణంగా ఉన్నాయి.

ఎన్నికల్లో ఎన్నడూ లేనంత ఉద్ధృతంగా మద్యం, నగదు పంపిణీ జరిగినట్టు మీడియా మొత్తం కోడై కూసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన 28వ తేదీ సాయంత్రం నుంచి 30వ తేదీ ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యే ఘడియ వరకు- ఈ మధ్యకాలంలో వేల కోట్లు చేతులు మారినట్టుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా అటు దేశంలో స్వాతంత్ర్యం వచ్చింది. ఇటు తెలంగాణ కూడా సిద్ధించింది. ఆ అమరుల స్వప్నం ఈ విధంగా నాయకులు సాకారం చేస్తున్నారా అనే ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల్లో పదేపదే తలెత్తుతోంది. దీనికి సమాధానం చెప్పాల్సిన నాయకులే అక్రమ మార్గంలో రాజకీయ లబ్ధి పొందడానికి అధికార దర్పాన్ని, అహంకారాన్ని, అంగ బలాన్ని అర్థ బలాన్ని, సమస్తాన్నీ వినియోగించుకుంటూ, పెద్ద ఎత్తున కరెన్సీ కట్టలను కూడా రంగంలోకి దించారు. అందుకే నాయకులకు ప్రజలే సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉంటుందో అది ప్రజలే తెలుసుకోవాలి.

We’re Now on WhatsApp. Click to Join.

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే నాయకులు చివరి ప్రయత్నంగా కూడా ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం దగ్గర ఆంధ్ర, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వివాదాన్ని వినియోగించుకోవడానికి కూడా నాయకులు ప్రయత్నం చేసినట్టు మీడియాలో వార్తలు రావడం బాధాకరం. చివరి ప్రయత్నంగా ఎవరు ఏం చేసినా తెలంగాణ ప్రజలు ఇప్పటికే మైండ్ మేకప్ చేసుకుని ఉన్నట్టు పలు మీడియా సంస్థల సర్వేల ద్వారా అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న దశలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె రెండు నిమిషాల వీడియోను తన ట్విట్టర్ (X) అకౌంట్లో పెట్టారు. దాన్ని రాహుల్ గాంధీ షేర్ చేశారు. తనను సోనియా అమ్మ అని తెలంగాణ ప్రజలు ఎంతో గౌరవించారని, వారి గౌరవాన్ని నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తానని ఆమె అన్నారు. అంతేకాదు ఆత్మ బలిదానాలు చేసిన తన బిడ్డల కలలు నిజం కావాలని తెలంగాణ తల్లి కోరుకుంటున్నది అన్న సోనియా గాంధీ మాట అత్యంత ఉద్వేగభరితమైన భావాన్ని తెలంగాణ ప్రజల గుండెల వద్దకు మోసుకెళ్లింది. ఈసారి ఎన్నికలు తెలంగాణలో మొత్తం దేశానికి ఒక దారిని చూపే కీలక ఘట్టంగా పరిణమించింది.

తెలంగాణ తెచ్చిన వారికా, ఇచ్చిన వారికా అనే ఏకైక ఎజెండాలో ఎన్నికలు సాగాయి. సోనియాగాంధీ చేసిన ట్వీట్ లో దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి అన్న నినాదం కూడా ఈ ఎన్నికల్లో కీలకమైందిగా భావించాలి. పథకాల ప్రచారం మాట ఎలా ఉన్నా, ఇరుపక్షాల వాగ్దానాలు విషయం ఎలా ఉన్నా, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ మరో రూపంలో పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ ది కుటుంబ పాలన అన్న వాదనను బలంగా ముందుకు తీసుకువెళ్లారు. టిఆర్ఎస్ వారు గత ఏభై,ఆరవైఏళ్లుగా తెలంగాణను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మరోసారి ఆ పార్టీని నమ్మితే అంతా అంధకారమేనని బలంగా వాదిస్తూ ప్రజల ముందుకు వెళ్లారు. ఎటు తిరిగి ఇటు చూసినా చివరికి తెలంగాణ ప్రజల ముందు సెంటిమెంట్ ప్రధానంగా మారిపోయింది. మరోపక్క ఛత్తీస్గడ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరాం రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికే తమ తమ అభిమతాలను ఓట్ల రూపంలో పదిలపరిచి ఉంచారు. అనేక మీడియా సంస్థలు ఎన్నెన్నో సర్వేలు చేశాయి. ఏది ఏమైనప్పటికీ 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. వాటిలో ఏ రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది ఒక అంచనా వస్తుంది.

మిగిలిన రాష్ట్రాల ఫలితాలు ఒక ఎత్తు, తెలంగాణ ఫలితం ఒక ఎత్తుగా ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ మీదనే పడింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కి, బిజెపికి కూడా అత్యంత ప్రాణప్రదమైన ఎన్నికలుగా వీటిని అందరూ భావిస్తున్నారు. చూడాలి, ప్రజల తీర్పు అలా ఉంటుందో. ఏ రాష్ట్రంలో ఓటరు తీర్పు ఏ విధంగా ఉన్నా, 70 ఏళ్ల భారత ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో డబ్బుతో ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాలని చూసే నాయకుల హీనమైన హేయమైన ప్రయత్నాలు, మనం ఏం సాధించామో గుండెల మీద గుద్ది చెబుతున్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియ, ఫలితాల ప్రకటన ముగిసాక అసలైన హార్స్ ట్రేడింగ్ మాయాజాలం తెరమీదకు వస్తుంది. ఎన్నికలను అమ్మకాల కొనుగోళ్ళ మార్కెట్ మాయగా మార్చిన మహామహులకు గుణపాఠం నేర్పే రోజు ఎప్పుడొస్తుందో, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఈ దేశంలో వర్ధిల్లుతున్నట్టు గుర్తించాలి.

Also Read:  Telangana Polling Day 2023