Site icon HashtagU Telugu

September 17: అందరి దృష్టి సెప్టెంబర్ 17 పైనే..!

September 17

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

By: డా. ప్రసాదమూర్తి

September 17: అనుకున్న తేదీ రానే వచ్చింది. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది. తెలంగాణలో మూడు ప్రధాన పక్షాలు తమ బలాబలాల నిరూపణకు ఒక తేదీని ఎంచుకున్నాయి. అదే సెప్టెంబర్ 17 (September 17). తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ తేదీ నేపథ్యం. తెలంగాణ ఆవిర్భావం పట్ల ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నదో గాని, ఆ తేదీని తమ రాజకీయ ప్రయోజనాలకు దివ్యాస్త్రంగా వాడుకోవాలని పార్టీల పరమ ప్రయత్నం. అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కొత్త సిడబ్ల్యూసి ఏర్పడిన తర్వాత తొలి సమావేశాలు హైదరాబాదులో నిర్వహించాలని, ఈ సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తమ నిర్ణయాన్ని ప్రకటించింది. తరువాత వెంటనే రాష్ట్రంలో మరో ప్రతిపక్షమైన బిజెపి వారు మేము కూడా అదే రోజున సభ పెడుతున్నామని, సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ విచ్చేస్తున్నారని ప్రకటించారు. మరి వీళ్ళిద్దరూ ఇలా ఉంటే అధికారంలో ఉన్న మనమేం తక్కువ తిన్నామని తాము కూడా సెప్టెంబర్ 17న ఒక విశిష్ట కార్యక్రమం చేయబోతున్నామని పాలక బీఆర్ఎస్ ప్రకటించింది.

ఇలా సెప్టెంబర్ 17వ తేదీ అత్యంత కీలకంగా మారింది. ఆ రోజు ఎవరు ఎలాంటి బల ప్రదర్శన చేస్తారు, ప్రజలకు ఏం వాగ్దానాలు ఇస్తారు, ఏ పథకాలు ప్రకటిస్తారు, ఒకరి మీద ఒకరు ఏ వస్త్రాలు సంధిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఒకసారి చరిత్రలోకి వెళితే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది అన్న సంగతి గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వారితో సహా తెలంగాణలో అతి సాధారణ జనం కూడా తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చిందని నమ్ముతారు. మరి అలాంటి సోనియాగాంధీ ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాదులో అడుగుపెట్టి, తెలంగాణ ప్రజల కోసం మరిన్ని వరాలు కురిపించడానికి కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయ దుందుభి విమోగించిన గొప్ప ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు సాగుతోంది. కర్ణాటకలో ఎలాంటి ప్రజోప్రయోగ పథకాలను ప్రకటించి ఎన్నికల్లో విజయం సాధించారో మనకు తెలుసు. ఇప్పుడు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల, ముఖ్య నేతల సమక్షంలో సోనియా గాంధీ ఏ ప్రకటన చేయబోతున్నారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. తాము ఇచ్చిన..తాము తెచ్చిన తెలంగాణ, దొరల పాలయిందని, అశేష ప్రజానీకం ఆకాంక్షలు నెరవేరలేదని కాంగ్రెస్ వాదన. మరి ఈ స్వతంత్ర తెలంగాణ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేదానికి సమాధానంగా ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభను నిర్వహించడం కోసం వారు అడిగిన పెరేడ్ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియం లను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇక తప్పక హైదరాబాద్ శివారులో ఒక ప్రైవేటు స్థలంలో కాంగ్రెస్ పార్టీ తన బల ప్రదర్శన నిరూపించుకోవడానికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

Also Read: M.S.Subbulakshmi : సామాన్య కుటుంబం నుంచి సంగీత సామ్రాజ్ఞి దాకా ఎదిగిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి

ఇదే నేపథ్యంలో అమిత్ షా నేతృత్వంలో బిజెపి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తమ ఎన్నికల ప్రచారోత్సవంగా మార్చుకోవాలని చూస్తోంది. అధికార పార్టీ అపజయాలను, కేంద్రంలో ఉన్న తమ పార్టీ విజయాలను ఏకరువు పెట్టి తెలంగాణ ప్రజలకు, ఒకే దేశం ఒకే పార్టీ అన్న సూక్తులు వల్లించి వారిని తమ వైపు తిప్పుకోవడానికి అమిత్ షా ప్రయత్నించవచ్చు‌. ఇక వీరి అందరి ప్రయత్నాలను తెప్పికొట్టడానికి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో, సెప్టెంబర్ 17వ తేదీన ఆయన ఏం చేయబోతున్నారో, ఏం మాట్లాడబోతున్నారో, ప్రజలకు ఏమి హామీలు ఇవ్వబోతున్నారో చూడాలి. సోనియా గాంధీ, అమిత్ షా రాకలను ప్రజలకు ఫలితం లేని రాకపోకలుగా మార్చడానికి కేసీఆర్ ఎలాంటి మార్మిక రాజకీయ చతురత ప్రదర్శిస్తారో చూడాలి. మొత్తానికి సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ ప్రజలకే కాదు, దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన కీలకమైన తేదీగా మారిందని చెప్పాలి.

Exit mobile version