New Registration Charges : తెలంగాణలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మారనున్నాయి. ఈ ఛార్జీలు ఎంతమేర ఉండాలి ? అనే దానిపై చర్చించేందుకు ఈనెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించనున్నారు. దశల వారీగా సమీక్షలు, పరిశీలనలు పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను(New Registration Charges) ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఆ తర్వాత పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి, తుది మార్కెట్ విలువలను నిర్ధారిస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన తర్వాత ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి వస్తాయి.
We’re now on WhatsApp. Click to Join
గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రేట్ల సవరణలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలని నిర్దేశించారు. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోనున్నారు.
Also Read :Popular Father Characters : ‘ఆ నలుగురు’.. తండ్రి పాత్రల్లో వారికి వారే సాటి!
- భూముల రేట్ల సవరణ కోసం జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని గ్రామాలను గుర్తించనున్నారు. వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకొని మార్కెట్ విలువలలో మార్పులు చేస్తారు.
- వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనతో బహిరంగ మార్కెట్ ధరలపై అంచనాలను రూపొందిస్తారు.
- వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులున్న చోట ఆ ప్రాంతానికి అనుగుణంగా భూముల రేట్లను డిసైడ్ చేస్తారు.
- కాలనీలు, మౌలిక వసతులు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత రేట్లతో పోల్చి అవసరమైతే భూముల రేట్లలో మార్పులుచేస్తారు.
- పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి ల్యాండ్స్ రేట్లను ప్రతిబింబించేలా సవరణ చేపట్టనున్నారు.