Akhilesh Yadav meet KCR : రాహుల్ అలా చెప్పారు.. అఖిలేష్ ఇలా వ‌చ్చారు.. విప‌క్షాల కూట‌మిలో అస‌లేం జ‌రుగుతుంది.?

సీఎం కేసీఆర్‌తో స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ భేటీ అయ్యారు. విప‌క్షాల కూట‌మిలో కొన‌సాగుతున్న అఖిలేష్ హైద‌రాబాద్ వ‌చ్చి కేసీఆర్‌తో భేటీ కావ‌టం దేశ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  • Written By:
  • Updated On - July 3, 2023 / 08:44 PM IST

2024లో జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ (BJP) ని గ‌ద్దెదించేందుకు బీజేపీయేత‌ర పార్టీలు ఏక‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్‌ (Congress) తో పాటు మ‌రికొన్ని పార్టీలు విప‌క్షాల కూట‌మి (Opposition parties) గా ఏర్ప‌డి ప్ర‌ధాని మోదీ (PM Modi) పై స‌మ‌ర‌శంఖాన్ని పూరిస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) నేతృత్వంలో కాంగ్రెస్‌తో పాటు యూపీ స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్‌, ప‌శ్చిమ‌ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ల‌తో పాటు దాదాపు ఇర‌వై పార్టీల నేత‌లు కూట‌మిగా ఏర్పడేందుకు సిద్ధ‌మ‌య్యారు. పాట్నాలో గ‌త నెల 23న విప‌క్షాల తొలి స‌మావేశం జ‌రిగింది. ఈనెల‌లో రెండో ద‌ఫా స‌మావేశంను కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో బెంగ‌ళూరులో నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఇదేస‌మ‌యంలో వ‌ర్షాకాల‌పు పార్ల‌మెంట్ స‌మావేశాలకు తోడు ఎన్సీపీలో చీలిక‌ నేప‌థ్యంలో విప‌క్షాల స‌మావేశం వాయిదా ప‌డింది.

విప‌క్షాల‌  స‌మావేశాల‌కు బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అంద‌లేదు. విప‌క్షాల కూమిలోని కాంగ్రెస్‌తో పాటు ప‌లు పార్టీలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ బీ టీంగా పేర్కొంటున్నాయి. దీనికితోడు బీఆర్ఎస్‌ను విప‌క్షాల కూట‌మిలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అభ్యంత‌రం చెప్పిన‌ట్లు గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. దీనికి కార‌ణం.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉండ‌ట‌మే. తెలంగాణ‌లో మ‌రో నాలుగు నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. బీఆర్ ఎస్ పార్టీని గ‌ద్దెదించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ఇదే విష‌యాన్ని రాహుల్ గాంధీసైతం చెప్పారు.

ఖ‌మ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జ‌న‌గ‌ర్జ‌న బ‌హిరంగ‌ స‌భ జ‌రిగింది. ఈ స‌భ‌లో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాల కూట‌మిలో బీఆర్ఎస్ పార్టీని చేర్చుకుంటే తాము దూరంగా ఉంటామ‌ని క్లారిటీగా చెప్పిన‌ట్లు రాహుల్ తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని, అందుకే విప‌క్షాల కూట‌మిలో అవ‌కాశం క‌ల్పించేందుకు కాంగ్రెస్ అభ్యంత‌రం చెప్పిన‌ట్లు తెలిపారు. రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టిరోజే స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ హైద‌రాబాద్ వ‌చ్చి సీఎం కేసీఆర్‌తో భేటీ కావ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం అఖిలేష్ యాద‌వ్ విప‌క్షాల కూట‌మిలో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టిరోజే అఖిలేష్ కేసీఆర్‌తో భేటీ కావ‌టం దేనికి సంకేతం అనే చ‌ర్చ తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనే కాక‌, దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర‌లేపింది.

Garuda Puranam : ఆ చిన్న చిన్న పొరపాటులే దురదృష్టం, దరిద్రానికి కారణం అన్న విషయం మీకు తెలుసా?