Site icon HashtagU Telugu

Bakka Judson : `సీబీఐ`కి చేరిన కాళేశ్వ‌రం, మేఘా వ్య‌వ‌హారం

Bakka Judson

Bakka Judson

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వైపు చూడ‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. వ‌ర‌ద‌ల్లో మునిగిపోయిన బాహుబ‌లి మోటార్ల‌తో పాటు విలువైన విద్యుత్ సామాగ్రి మునిగిపోయింది. మూడు వారాలుగా నీళ్ల‌లోనే ఉన్న ప్రాజెక్టు రూపంలో భారీ న‌ష్టం వాటిల్లింద‌ని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని వేల కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని తెలుస్తోంది. తెలంగాణ‌కు త‌ల‌మానికంగా చెప్పుకుంటోన్న ఆ ప్రాజెక్టు ను ప‌రిశీలించేందుకు విప‌క్ష లీడ‌ర్లు ఎవ‌రూ ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల మిన‌హా అక్క‌డికి వెళ్లాల‌న్న ఆలోచ‌న విప‌క్ష నేత‌లకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌ర్నీ అక్క‌డికి వెళ్ల‌కుండా ప్ర‌భుత్వం క‌ట్టుదిట్టం చేసింది. మేఘా కంపెనీ ప్రైవేటు సైన్యం ఆధీనంలో ప్ర‌స్తుతం మునిగిపోయిన ప్రాజెక్టు ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

మేఘా కంపెనీ నిర్మాణం చేసిన క‌ళేశ్వ‌రం ప్రాజెక్టులో అక్ర‌మాలు, అవినీతి, నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని రాత‌పూర్వ‌క ఫిర్యాదు తాజాగా సీబీఐకి చేరింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ ఆధారాల‌తో స‌హా సీబీఐకి ఫిర్యాదు అంద‌చేశారు. ఆయ‌నిచ్చిన ఫిర్యాదు మేర‌కు 40వేల కోట్ల‌తో ప్రారంభ అంచ‌నాల‌తో ప్రారంభ‌మైన ఆ ప్రాజెక్టు వ్య‌యం 2020 నాటికి 80వేల కోట్ల‌కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1.15కోట్ల‌ను ఖ‌ర్చు చేసిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధుల‌ను భారీగా ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప‌క్క‌దోవ ప‌ట్టించార‌ని ఆరోపించారు. అంతేకాదు, కేంద్రం గ‌త నాలుగేళ్లుగా జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద ఇచ్చిన 3982 కోట్ల రూపాయాల‌ను కూడా డైవ‌ర్ట్ చేసి ప్రాజెక్టు నిర్మాణానికి ఖ‌ర్చు పెట్టారని సీబీఐకి నివేదించారు.

ప్ర‌స్తుతం వ‌ర‌ద‌ల్లో బాహుబ‌లి మోటార్లు మునిగిపోయాయి. వాటికి సంబంధించిన రిపేర్ ఖ‌ర్చును మేఘా కంపెనీ పెట్టాల‌ని ఫిర్యాదులో కోరారు. ప్ర‌భుత్వంతో ఒప్పందం ప్ర‌కారం నిర్వ‌హ‌ణ మొత్తం మేఘా చేయాల‌ని సీబీఐకి తెలిపారు. ప్రాజెక్టులో జ‌రిగిన మొత్తం అక్ర‌మాలు, అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతి, నిధుల దుర్వినియోగం, ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డం వంటి అంశాల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని సీబీఐని జ‌డ్స‌న్ కోరారు. సీఎం కేసీఆర్ అవినీతిపై అంత‌క‌ముందు ఇచ్చిన ఫిర్యాదును గుర్తు చేస్తూ నీతి ఆయోగ్ కు కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టు అక్ర‌మాల‌ను తెలియ‌చేస్తూ ఇచ్చిన ఫిర్యాదును కోడ్ చేశారు. మొత్తం మీద ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హ‌రం సీబీఐ వ‌ర‌కు చేరింది. దీనిపై ఏ విధంగా ఆ సంస్థ స్పందిస్తుందో చూడాలి.