Site icon HashtagU Telugu

Munugode Elections : పీసీసీకే వ‌దిలేసిన `మునుగోడు` గెలుపు!

మునుగోడు ఉప ఎన్నిక‌లను సోనియా, రాహుల్‌, ప్రియాంక సంయుక్తంగా పీసీసీకి వ‌దిలేసిన‌ట్టే. హ‌ఠాత్తుగా అమెరికా వెళ్లిన సోనియా కుటుంబం మునుగోడు మీద దృష్టి పెట్టే ఛాన్స్ లేదు. సీనియర్ల నుంచి ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటోన్న రేవంత్, మాణ్యిక్యం, కేసీ వేణుగోపాల్ టీమ్ నిర్దేశం మేర‌కు అంతా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మునుగోడు అభ్య‌ర్థిగా చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డిని సూచించిన రేవంత్ నిర్ణ‌యం మేర‌కు టిక్కెట్ ఖ‌రారు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. నెహ్రూ కుటుంబం అమెరికా వెళ్ల‌డం ఇక మునుగోడు రేవంత్ చేతుల్లోకి పూర్తిగా వెళ్లిన‌ట్టే క‌నిపిస్తోంది.

మునుగోడు , తెలంగాణ పీసీసీ లుక‌లుక‌లే కాదు, ఏఐసీసీలో రాజ‌కీయాలు కుదుట‌ప‌డ‌లేదు. ఆలోపుగానే సోనియాకు మ‌రోసారి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయోమ‌యంలో ప‌డిపోయింది. బీజేపీకి ర‌థ యాత్ర బూస్ట్ ఇచ్చిన‌ట్టు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికి భారత్ జోడో, మెహంగాయి పర్ హల్లాబోల్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందులో కీలక పాత్రలను పోషించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు.ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఏ రోజుకారోజు యాత్రలో సమీక్షించేలా ప్లాన్ చేశారు.

పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉన్న నేప‌థ్యంలో సోనియా ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టారు. హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లారు. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. ఆ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ దేశానికి వెళ్తారనేది వెల్లడించలేదు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలను ప్రయోగిస్తోండటం వంటి అంశాల ఆధారంగా భారత్ జోడో యాత్రను స‌క్సెస్ చేయాల‌ని సోనియా భావించార‌ట‌.

సెప్టెంబర్ 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర మొదలు కాబోతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ కాలినడకన ఈ యాత్ర కొన‌సాగిస్తారు. కన్యాకుమారిలో ప్రారంభ ఉపన్యాసం చేసి భారత్ జోడో యాత్ర కు శ్రీకారం చుడ‌తారు. ఇదంతా ప్లాన్ జ‌రిగిన త‌రువాత ఆక‌స్మాత్తుగా సోనియాను రాహుల్‌, ప్రియాంక విదేశాల‌కు తీసుకెళ్లే ప‌నిలో ఉన్నారు. ఆ క్ర‌మంలో మునుగోడు మీద ఇప్ప‌ట్లో ఏఐసీసీ దృష్టి సారించే ఛాన్స్ లేదు. ఫ‌లితంగా రేవంత్ రెడ్డి మీద మొత్తం భారం వేసిన‌ట్టు తెలుస్తోంది.