Telangana Talli: తెలంగాణ త‌ల్లి `రూపం`ఎవ‌రిష్టం వాళ్ల‌దే

రాజ‌కీయాల‌కు ఏదీ అతీతం కాదంటారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌ల్ని కనెక్ట్ కావ‌డానికి ఏది అవ‌స‌ర‌మో దాన్ని లీడ‌ర్లు ప్ర‌యోగిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 07:00 PM IST

రాజ‌కీయాల‌కు ఏదీ అతీతం కాదంటారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌ల్ని కనెక్ట్ కావ‌డానికి ఏది అవ‌స‌ర‌మో దాన్ని లీడ‌ర్లు ప్ర‌యోగిస్తుంటారు. ద‌శాబ్ద కాలంగా విగ్ర‌హాల రాజ‌కీయం తెలుగు రాష్ట్రాల్లో బాగా క‌నిపిస్తోంది. ఊరూరా వైఎస్సార్ విగ్ర‌హాల‌ను పెట్ట‌డం ద్వారా రాజ్యాధికారాన్ని జ‌గ‌న్ సాధించారు. తెలంగాణ త‌ల్లిని క్రియేట్ చేసి కేసీఆర్ సెంటిమెంట్ ను రాజేసి సీఎం అయ్యారు. ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను పెట్ట‌డం ద్వారా సానుభూతి పొందాల‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన ప్రాంతీయ పార్టీల మాదిరిగా విగ్ర‌హాల రాజ‌కీయానికి శ్రీకారం చుట్టింది.

కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్లు స‌హ‌జంగా ఇందిర‌, రాజీవ్ విగ్ర‌హాల‌ను పెడుతుంటారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌ను స్మ‌రించుకుంటూ గాంధీభ‌వ‌న్లో చిత్ర‌ప‌టాల‌కు నివాళులు అర్పిస్తారు. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెప్టెంబ‌ర్ 17వ తేదీని పుర‌స్క‌రించుకుని తెలంగాణ త‌ల్లి (కాంగ్రెస్ ) విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఇక రాబోవు రోజుల్లో ప్ర‌తి గ్రామానికి రేవంత్ రెడ్డి కొత్త‌గా రూపొందించిన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. ప్ర‌త్యేక జెండాను తెలంగాణ కోసం రూపొందించారు. రాబోవు రోజుల్లో టీఎస్ వాహ‌నాల‌న్నీ టీజీ కింద మార్చుకోవాల‌ని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఆయ‌న వాల‌కాన్ని గ‌మ‌నించిన సీనియ‌ర్లు ఫ‌క్తు ప్రాంతీయ పార్టీ మాదిరిగా కాంగ్రెస్ పార్టీని మార్చేశార‌ని నెత్తీనోరుమోదుకుంటున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీనా? రేవంత్ కాంగ్రెస్ పార్టీనా? అనే సెటైర్లు వేసుకుంటూ లోలోప‌ల మ‌థ‌న‌ప‌డ‌డం గ‌మ‌నార్హం.

ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పాటు తెలంగాణ త‌ల్లిని చూపిస్తూ కేసీఆర్ రాజ‌కీయం చేశారు. తెలుగుత‌ల్లికి బ‌దులుగా ఆయ‌న తెలంగాణ త‌ల్లిని ఆనాడు క్రియేట్ చేశారు. ఆ విగ్ర‌హాన్ని తెలంగాణ వ్యాప్తంగా పెట్ట‌డం ద్వారా సెంటిమెంట్ ను రాజేసి సీఎం ప‌ద‌విని అందుకున్నారు. ఇప్పుడు ఆయ‌న జాతీయ స‌మైక్య‌త అంటూ కొత్త నినాదం అందుకున్నారు. అందుకు త‌గిన విధంగా భార‌త మాత విగ్ర‌హాన్ని మ‌రోదాన్ని రూపొందించే పనిలో ప‌డ్డార‌ని తెలుస్తోంది. సాధార‌ణంగా అంబేద్క‌ర్, గాంధీ, స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ త‌దిత‌ర స్వాత్రంత్య స‌మ‌ర‌యోధుల విగ్ర‌హాల‌ను పార్టీల‌కు అతీతంగా స్థాపించే సంస్కృతి ఉండేది. ఆ త‌రువాత రాజ‌కీయ పార్టీల అధిప‌తులు, వ్య‌వ‌స్థాప‌కుల‌ విగ్ర‌హాల‌ను పెట్ట‌డం అలవాటుగా మారింది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వ‌ర‌కు ఇలా విగ్ర‌హాల‌ను పెట్ట‌డం చూస్తున్నాం. ఆ ఒర‌వ‌డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ విగ్ర‌హాల‌ను పెట్ట‌డం ద్వారా మ‌రింత పెరిగింది.

తాజాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్ర‌త్యేక జెండా, గీతం, విగ్ర‌హాల‌ను త‌యారు చేసుకోవ‌డం ఒక రాజ‌కీయ అంశంగా మారింది. అంతేకాదు, ఒక్కో పార్టీ ఒక్కో విధమైన విగ్ర‌హాల‌ను ఆయా రాష్ట్రాల‌కు చిహ్నంగా త‌యారు చేయించ‌డం లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. దానికి రేవంత్ రెడ్డి నాంది ప‌లికారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇదే పంథాను ఎంచుకుంటుందా? లేక తెలంగాణ కాంగ్రెస్ వ‌ర‌కు ప‌రిమితమా? అనేది చూడాలి.