Site icon HashtagU Telugu

Trains Haltings : నేటి నుంచి ఈ రైళ్లకు అదనపు హాల్టులు

Train Tickets

17 Trains Cancelled

Trains Haltings : తెలంగాణ రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు హాల్టులను ఇస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి వివిధ రూట్లలో రాకపోకలు సాగించే పలు ట్రైన్లకు అదనంగా హాల్టులు ఉంటాయని వెల్లడించింది. నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. హజ్రత్‌ నిజాముద్దీన్‌ – గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌, పెద్దపల్లి స్టేషన్లలో.. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌ జమ్మికుంట స్టేషన్‌లో.. సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌, సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ హిస్సార్‌, హైదరాబాద్‌-రాక్సల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పెద్దపల్లిలో, సికింద్రాబాద్‌-బీదర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ మర్పల్లి స్టేషన్‌లో ఆగుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. నారాయణాద్రి – విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లు మిర్యాలగూడలో.. నర్సాపూర్‌ – విశాఖ, చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లు నల్గొండలో ఆగుతాయని తెలిపింది. నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మిర్యాలగూడలో.. నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ నల్గొండలో.. హైదరాబాద్‌-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌ గద్వాలలో.. అంబేద్కర్‌నగర్‌-యశ్వంత్‌పూర్‌, నాగర్‌సోల్‌-చెన్నై సెంట్రల్‌, గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌లో.. యశ్వంత్‌పూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ షాద్‌నగర్‌, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతాయి. ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

అయోధ్య రామమందిరం దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్స్‌ నడిపిస్తోంది. వరంగల్, కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ వేశారు. ప్రతి సోమవారం వరంగల్ నుంచి ‘శ్రద్దా సేతు’ రైలు అయోధ్యకు వెళుతుంది. ప్రతి శుక్రవారం కాజీపేట నుంచి యశ్వంత్ పూర్- గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు అయోధ్యకు ప్రయాణిస్తుంది. ఈ రైళ్లలో జనరల్ టికెట్ ధర రూ.400 కాగా, స్లీపర్ క్లాస్ ధర రూ.658గా నిర్ణయించారు. ఈ నెల 30 నుంచి స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: Free Electricity : ఉచిత విద్యుత్‌ స్కీం అమలుకు ప్రత్యేక పోర్టల్ ?

అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 60  రైళ్లు నడుస్తాయి. వాటిలో 15 రైళ్లు సికింద్రాబాద్‌ మీదుగా నడుస్తాయి. సాధారణ ప్రయాణికులు ఈ రైళ్లలో నేరుగా బుకింగ్‌ చేసుకొనే సదుపాయం ఉండదు. విశ్వహిందూపరిషత్, బజరంగ్‌దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే  భక్తులకు రైల్వేసేవలు లభిస్తాయని ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు తెలిపారు. భక్తులను అయోధ్యకు తరలించేందుకు, తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు వీలుగా వీహెచ్‌పీ తదితర సంస్థలు  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.  ఈ నెల 22వ తేదీన జరగనున్న  బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి నేరుగా వెళ్లేందుకు ఎలాంటి రైళ్లు అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తారు. ఫిబ్రవరిలో మరో 12 రైళ్లు నడుపుతారు.