Telangana – Adani : తెలంగాణలో అదానీ రూ.12,400 కోట్ల పెట్టుబడులు.. వివరాలివీ

Telangana - Adani : స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో తెలంగాణలో పెట్టుబడులపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 04:16 PM IST

Telangana – Adani : స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో తెలంగాణలో పెట్టుబడులపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రూ.12,400 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించి సీఎం రేవంత్​ రెడ్డితో గౌతమ్ అదానీ​ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా అదానీ గ్రూపునకు చెందిన పలు కంపెనీలతో నాలుగు అవగాహన ఒప్పందాలను తెలంగాణ సర్కారు కుదుర్చుకుంది. పరిశ్రమలకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి సీఎం రేవంత్ రెడ్డి(Telangana – Adani) ఈసందర్భంగా హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

  • గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ.5000 కోట్లు, డేటా సెంటర్​ విభాగంలో రూ.5000 కోట్లు. ఏరోస్పేస్​ అండ్​ రక్షణ విభాగంలో రూ.1000 కోట్లు, అంబుజా సిమెంట్​ గ్రిడ్డింగ్​ యూనిట్​లో రూ.1400 కోట్లు పెట్టుబడి పెడతామని  అదానీ గ్రూప్ అనౌన్స్ చేసింది.
  • అదానీ ఎంటర్‌ప్రైజెస్ చందనవెల్లిలో రూ.5000 కోట్లతో 100 మెగావాట్ల డేటా సెంటర్​ను నెలకొల్పనుంది.
  • అదానీ గ్రీన్ ఎనర్జీ మరో రూ.5 వేల కోట్లతో 1350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను నాచారం, కోయబస్తీ గూడంలలో ఏర్పాటు చేయనుంది.
  • అంబుజా సిమెంట్స్ రూ.1400 కోట్లతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సిమెంటు పరిశ్రమను నెలకొల్పనుంది. అయిదారేళ్లలో సిమెంటు ప్లాంటు పనులు పూర్తయ్యాక సుమారు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ వెల్లడించింది.
  • అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న పదేళ్లలో అదానీ గ్రూప్ రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Also Read: 10 Strongest Currencies : టాప్-10 పవర్‌ఫుల్ కరెన్సీల లిస్టు ఇదే.. ఇండియా ర్యాంక్ తెలుసా ?

దావోస్​లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆరాజెన్ కంపెనీ సీఈవో మణి కంటిపూడి సమావేశమయ్యారు. ఈ కంపెనీ రూ.2000 కోట్లతో మల్లాపూర్​లో ఉన్న  పరిశ్రమ విస్తరించాలని నిర్ణయించింది.దీంతో 1500 మందికి ఉపాధి లభిస్తుందని ఆరాజెన్ సీఈవో చెప్పారు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, ఎల్​డిసీ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సమావేశమైంది. ఈ లెక్కన దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌కు విశేష స్పందన లభిస్తున్నట్లు అయింది. రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది.