Labourer’s Rights: హైదరాబాద్ ‘కర్మ’గారం!

రెక్కాడితే డొక్కాడనీ కుటుంబాలెన్నో.. అర్ధాకలితో అలమటించే కార్మికులెందరో...

  • Written By:
  • Updated On - March 26, 2022 / 05:27 PM IST

రెక్కాడితే డొక్కాడనీ కుటుంబాలెన్నో.. అర్ధాకలితో అలమటించే కార్మికులెందరో.. ఉన్న ఊళ్లో ఉపాధి లేక హైదరాబాద్ లాంటి మహానగరం బాట పడుతున్నారు వలస కూలీలు, కార్మికులు. అయితే తెలంగాణలో పనిచేస్తున్న చాలా మంది కార్మికులు ‘కార్మిక చట్టాల పరిధి’లోకి వచ్చే హక్కులు లేకుండా పనిచేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. బీహార్‌కు చెందిన 11 మంది కార్మికుల ప్రాణాలను బలిగొన్న బోయిగూడలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం, దాని తర్వాత పరిణామాలు రాష్ట్రంలోని వలస కార్మికుల దౌర్భాగ్య స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. తెలంగాణలో ఇంటి సహాయకులతో కలిపి దాదాపు 45 లక్షల మంది కార్మికులున్నారు.

కార్మిక సంఘంతో సన్నిహితంగా పనిచేసే సామాజిక సంస్థలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు పరిశ్రమలు లైసెన్స్‌లు, అధికారిక రిజిస్ట్రేషన్‌లు లేకుండానే పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. కార్మికులకు అందించే వేతనాల్లో కూడా కోత పెడుతున్నారు. హైదరాబాద్ పాటు ఇతర ప్రాంతాల్లోనూ చాలా ఫ్యాక్టరీలు, పరిశ్రమలు కనీస భద్రతా చర్యలు పాటించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి.  ప్రమాదాలు జరిగిన సమయంలో మాత్రమే చర్యలు చేపట్టి, కొంత పరిహారం చెల్లించిన తర్వాత కార్మికుల రక్షణను పట్టించుకోవడం పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, కేరళ రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడి ప్రభుత్వం కూలీలకు వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

అన్ని పరిశ్రమల తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈ విషయమై ‘తెలంగాణ న్యాయ సేవా అధికారుల ఎన్జీవో ప్రతినిధి’ శ్రీ లిస్సీ జోసెఫ్ స్పందిస్తూ.. హైదరాబాద్ లాంటి నగరాల్లోనే నెలకొల్పబడిన కార్మాగారాలు, ఫ్యాక్టరీల్లో ఏమాత్రం తనిఖీలు చేయడం లేదనీ, ఫలితంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డాక్టర్ ఇ. గనాగ్ధర్ రియాక్ట్ అవుతూ.. కూలీలందరికీ సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. కానీ ఆచరణలో మాత్రం ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదని పలు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బోయిగూడ ఘటనతోనైనా ప్రభుత్వాలు గుణపాఠంగా భావించి, కార్మికులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.