వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో ప్రధాన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. లగచర్లలో ఫార్మా సిటీకి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, జిల్లా అధికారులపై కొంతమంది రైతులు దాడి చేయడం కలకలం రేపింది. దాడి కేసులో నిందితులను పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి, కొడంగల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు, అందులో 16 మందికి రిమాండ్ విధించారు.
పరిగి పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 55 మంది రైతులను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం 39 మంది రైతులను విడుదల చేయగా, 16 మందిని మరింత లోతుగా విచారించారు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సురేశ్‌గా గుర్తించారు. మణికొండ ప్రాంతంలో నివసించే సురేశ్ ఈ ఘటనకు పక్కా ప్రణాళికతో లగచర్లకు వచ్చి గ్రామస్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇక లగచర్లలో ఫార్మా సిటీ ప్రాజెక్ట్ హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న మెగా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ఫార్మాస్యూటికల్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన పారిశ్రామిక వేదికను సృష్టించడం. తెలంగాణ ప్రభుత్వం ఫార్మా సిటీ ద్వారా రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వివిధ ఫార్మా కంపెనీలు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ ప్రాజెక్ట్‌తో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ ఫార్మా సిటీ నిర్మాణంపై స్థానిక గ్రామస్తులు మరియు రైతుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మా సిటీ నిర్మాణం కారణంగా తమ భూములు కోల్పోతున్నామని, తమ జీవనాధారాలపై ప్రాజెక్టు ప్రభావం పడుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Assembly meetings : మైకు ఇవ్వరని జగన్ చెప్పడం విడ్డూరం: వైఎస్ షర్మిల