Site icon HashtagU Telugu

KCR Letter : రాజకీయ కక్షతోనే నాపై విచారణ.. నరసింహారెడ్డి తప్పుకోవాలి.. కేసీఆర్ లేఖ

Kcr Brs

Kcr Brs

KCR Letter : బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు భారీగా విద్యుత్‌ను కొనుగోలు చేశారు. ఆ వ్యవహారంపై విచారణ కోసం సీఎం రేవంత్ సర్కారు జస్టిస్ నరసింహారెడ్డి సారథ్యంలో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విచారణను వేగవంతంగా నిర్వహిస్తున్న  ఈ కమిషన్ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ సహా మొత్తం 25 మందికి నోటీసులు జారీ చేసింది.    ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్‌ కొనుగోళ్లు, టెండర్ల వ్యవహారంపై వాారిని వివరణ కోరింది. అందుకోసం ఈనెల 15వ తేదీని డెడ్ లైన్‌గా విధించింది. ఈనేపథ్యంలో ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల్లో తన వివరణను జ్యుడీషియల్ కమిషన్‌కు పంపారు. అందులో గులాబీ బాస్(KCR Letter) కీలక వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కారు జస్టిస్ నరసింహారెడ్డి సారథ్యంలో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.  ‘‘మా హయాంలో కరెంట్ విషయంలో గణనీయ మార్పు చూపించాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం’’ అని గులాబీ బాస్ చెప్పుకొచ్చారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. అప్పట్లో కరెంట్ కోతలతో మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే వారని వివరించారు. అప్పట్లో జనరేటర్లు, ఇన్వర్టర్లపై ఆధారపడాల్సి వచ్చేదని కేసీఆర్ చెప్పారు.  జ్యుడీషియల్ కమిటీ విచారణ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదన్నారు. విచారణ ప్రక్రియ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరుగుతోందని గులాబీ బాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గత ప్రభుత్వాన్ని విచారణ కమిషన్ పూర్తిగా తప్పుపడుతోంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లుగా..  ఆర్థిక నష్టాన్ని లెక్కించటమే మిగిలినట్లుగా వ్యవహరిస్తున్నారు’’ అని కేసీఆర్ ఆరోపించారు. ‘‘నన్ను, బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర జరగుతోంది. విచారణ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలి’’ అని గులాబీ బాస్ కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. తొలి అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేశారు. ఆ అంశంపై విచారణకు అప్పట్లోనే ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.