Abhishek Boinapally : అభిషేక్‌ బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌.. లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?

Abhishek Boinapally : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

  • Written By:
  • Updated On - March 20, 2024 / 02:40 PM IST

Abhishek Boinapally : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యకు చికిత్స చేయించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. అభిషేక్‌ బోయినపల్లికి ఐదు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరైనట్లు తెలిసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. బెయిల్‌ నిబంధనలను ట్రయల్‌ కోర్టు ఇస్తుందని సుప్రీంకోర్టు  తెలిపింది. పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలని అభిషేక్‌‌ను ఆదేశించింది.  ట్రయల్ కోర్టు అనుమతితో హైదరాబాద్‌‌కు వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2022 నవంబర్ 13న అభిషేక్‌ బోయినపల్లి అరెస్టయ్యారు. 19 నెలలుగా జైలులో ఉన్న అతడికి ఎట్టకేలకు ఇప్పుడు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join

కేసులో అభిషేక్ పాత్ర ఏమిటి ?

  • కవిత బినామీగా భావిస్తున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు 2021 జనవరిలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో విజయ్‌ నాయర్‌తో సమావేశమయ్యారు.
  • సౌత్ గ్రూపలో కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్‌ చంద్రా రెడ్డి ఉండగా.. వారికి ప్రతినిధులుగా అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్‌ వ్యవహరించారు. 2021 జూలై-సెప్టెంబరు మధ్య కాలంలో రూ.30కోట్లను  హవాలా మార్గం ద్వారా ఢిల్లీలోని ఆప్ నేతల వద్దకు తరలించారు.
  • 2021 సెప్టెంబరు 20న ఢిల్లీలో మద్యం ఉత్పత్తిదారు ఫెర్నార్డ్‌ ఇచ్చిన విందుకు అభిషేక్‌, అరుణ్‌ పిళ్లై, శరత్‌ చంద్రారెడ్డి హాజరయ్యారు.
  • 2022 సెప్టెంబరు నుంచీ అరెస్టులు మొదలయ్యాయి. మొదట ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్టయ్యారు. ఈ ఏడాది నవంబరులో శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌ బాబు, విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, అమిత్‌ అరోరా అరెస్టయ్యారు.
  • 2023 ఫిబ్రవరి 26న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.
  • 2023 జూన్‌లో శరత్‌ చంద్రారెడ్డి, సెప్టెంబరులో మాగుంట రాఘవరెడ్డి, దినేశ్‌ అరోరా అప్రూవర్లుగా మారారు.
  • తాజాగా కవిత అరెస్ట్ అయ్యారు.
  • ఇక ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది.

Also Read :Modi Guarantee Vs Rumors : ‘మోడీ గ్యారంటీ రూ.3వేలు’ వదంతి.. పోస్టాఫీసుకు ఎగబడ్డ మహిళలు

కేసులోని కీలక పరిణామాలు

లిక్కర్‌ స్కామ్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా విచారణకు ఆదేశించడంతో 2022 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆగస్టు 22న ఈడీ ఎఫ్ఐఆర్‌ దాఖలు చేసింది. అదే ఏడాది నవంబరు 25న తొలి చార్జిషీటు దాఖలైంది. 2021 జూన్‌లో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకులు సౌత్‌ గ్రూప్‌ పేరుతో ఢిల్లీ రాజకీయ నేతలతో లావాదేవీలు జరిపారని అందులో పేర్కొంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తరఫున విజయ్‌ నాయర్‌ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించారని వెల్లడించింది. సీబీఐ చార్జిషీటు ప్రకారం దొడ్డిదారిన అక్రమార్జన కోసమే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారు. హోల్‌సేల్‌గా 12 శాతం లాభాలు, రిటైల్‌గా 185శాతం లాభాలు ఆర్జించాలని ప్రణాళికలు రచించారు. ఢిల్లీలో హోల్‌సేల్‌ వ్యాపార సంస్థ అయిన ఇండో స్పిరిట్‌ గ్రూప్‌నకు 65శాతం వాటా కేటాయించేందుకు అంగీకరించారు. ఇందులో సౌత్‌ గ్రూప్‌నకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 రిటైల్‌ జోన్లను కేటాయించారు.

Also Read :Blood Sugar: షుగ‌ర్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారా..? అయితే వీటికి దూరంగా ఉండండి..!