Aasara Pension Rs 3016 : ఆసరా పింఛను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రస్తుతం వివిధ విభాగాల లబ్ధిదారులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.2,016 పింఛను ఇస్తోంది. వీరికి వెయ్యి రూపాయలు పెంచి రూ.3,016 పింఛను ఇచ్చేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది. వాటిని తెలంగాణ ఆర్థిక శాఖకు పంపింది. తెలంగాణ ఆర్థిక శాఖ నుంచి ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేరుతాయి. కేసీఆర్ ఆమోదం లభించిన అనంతరం దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే 39 లక్షల మంది ఇతర పింఛనుదారులకు ప్రతినెలా రూ.3,016 అందుతాయి.
Also read : Naga Panchami 2023 : ఇవాళ నాగ పంచమి.. పూజలు చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయ్!
ఆసరా పథకంలో దివ్యాంగుల పింఛన్‌ను గత నెలలో రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచిన విషయం తెలిసిందే. దీనివల్ల 5,16,890 మంది దివ్యాంగులు లబ్ది పొందుతున్నారు. త్వరలో వృద్ధులు, వితంతువులకూ పింఛను మొత్తాన్ని పెంచుతామని ఆదివారం సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులతో పాటు పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు; గీత, చేనేత, బీడీ కార్మికులు; ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ రోగులకు కలిపి మొత్తం 44,82,254 మందికి పింఛను ఇస్తోంది.