Telangana AAP: లోక్ స‌త్తా, టీజేఎస్ కు ఆప్ గాలం

తెలంగాణ జ‌న‌సమితి అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రామిరెడ్డి గ‌త కొన్నేళ్లుగా పార్టీని న‌డుపుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణకు నోచుకోలేదు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత చిన్నా చిత‌క పార్టీలు చాలా ఆవిర్భవించినప్ప‌టికీ కోదండ‌రామిరెడ్డి పెట్టిన పార్టీ ప్ర‌భావం చూపుతుంద‌ని భావించారు.

  • Written By:
  • Updated On - March 28, 2022 / 11:41 AM IST

తెలంగాణ జ‌న‌సమితి అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రామిరెడ్డి గ‌త కొన్నేళ్లుగా పార్టీని న‌డుపుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణకు నోచుకోలేదు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత చిన్నా చిత‌క పార్టీలు చాలా ఆవిర్భవించినప్ప‌టికీ కోదండ‌రామిరెడ్డి పెట్టిన పార్టీ ప్ర‌భావం చూపుతుంద‌ని భావించారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా ఆయ‌న పార్టీని స్థాపించాడు. బ‌హుజ‌న తెలంగాణ నినాదం తీసుకుని 2018 ఏప్రిల్ 29వ తేదీ నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాడు. తెలంగాణ రాజ‌కీయ జేఏసీ క‌న్వీన‌ర్ గా ఉన్నప్పుడు ఆయ‌న‌కున్న క్రేజ్ పార్టీ పెట్టిన త‌రువాత త‌గ్గిపోయింద‌ని ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా అర్థం అవుతోంది.
నానాటికీ ఉనికి కోల్పోతోన్న తెలంగాణ జ‌న స‌మితి పార్టీని ఆప్ లో విలీనం చేయాల‌ని తాజాగా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆప్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మ‌హారాష్ట్ర‌, గోవా త‌దిత‌ర ఉత్త‌రాది రాష్ట్రాల్లో క్ర‌మంగా విస్త‌రింప చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. అదే విధంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప్ర‌త్యేకించి తెలంగాణ‌, ఏపీల్లో ఆప్ ను వినూత్నంగా ముందుకు తీసుకెళ్ల‌డానికి ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అందుకోసం లోక్ స‌త్తా పార్టీ చీఫ్ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌తో 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేజ్రీవాల్ సంప్ర‌దింపులు జ‌రిపాడు. ఆనాడు ఢిల్లీ వెళ్లిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ లోక్ స‌త్తా పార్టీతో ఆప్ పొత్తుకు ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, కేజ్రీవాల్ అందుకు అంగీక‌రించ‌క‌పోగా, పార్టీని విలీనం చేయాల‌ని కోరాడ‌ని ఆ రోజు వినిపించిన టాక్‌.
తెలుగు రాష్ట్రాల్లో లోక్ స‌త్తా పార్టీ దాదాపు క‌నుమ‌రుగు అయింది. ప్ర‌త్యామ్నాయంగా తెలంగాణ జ‌న స‌మితి చీఫ్ కోదండ‌రామిరెడ్డితో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం ద్వారా ఆప్ ను తెలంగాణ‌లో బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్రొఫెస‌ర్ కోదండ‌రామిరెడ్డి ఆప్ పార్టీలో టీజేఎస్ ను విలీనం చేస్తే తెలంగాణ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం ద్వారా రాబోవు ఎన్నిక‌ల్లో చ‌రిత్ర సృష్టించాల‌ని ఆ పార్టీ చీఫ్ భావిస్తున్నాడ‌ని ఢిల్లీ వ‌ర్గాల వినికిడి. ఆ దిశ‌గా ఇప్ప‌టికే కొంద‌రు మ‌ధ్య వ‌ర్తులు. ఆప్‌, టీజేఎస్ మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు టీజేఎస్ విలీనం వంతు వ‌చ్చింద‌ని ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యూత్ భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఇతర పార్టీలు ఉన్నా.. తారాస్థాయి పోరుమాత్రం కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్యనే ఉండబోతోంది. ఇటీవల చేసిన కొన్ని సర్వేల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు మాత్రమే పోటీ ఉంటుందని, బీజేపీకి మూడో స్థానంలో ఉన్నట్లు సర్వేలు ఉన్నాడ‌ని వినికిడి.
ఇదిలా ఉంటే… బీజేపీ నేతలు సైతం తమ సర్వే ఫలితాల్లో పార్టీ ఏ చోట బలహీనంగా ఉంది.. ప్రజలు దృష్టిని ఆకర్షించేందుకు వేయాల్సిన ఎత్తుగడలేంటని కసరత్తు మొదలెట్టారు. ఇక కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లైంది. ఎందుకంటే.. ఇటీవల వెలువడిన కొన్ని సర్వే ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయంగా నిలిచింది.
అయితే టీపీసీసీ అధ్యక్ష పీఠం కోసం ఆశించి భంగపడ్డ నేతలు, రేవంత్‌ రెడ్డి అధ్యక్షతను ఒకపట్టాన ఒప్పుకోలేదు.. ఇప్పుడిప్పుడే అందరినీ కలుపుకోని వెళ్తున్నట్లు ఉన్న రేవంత్‌ రెడ్డికి.. ఇటీవల సీనియర్ల సమావేశం తలనొప్పిని తీసుకువచ్చింది. సర్వేల్లో చూస్తే.. కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది.. కానీ.. పార్టీ నేతల్లోనే స్పష్టత కొరవడడంతో.. ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పోతాయనే భావన కాంగ్రెస్‌ శ్రేణుల్లో నెలకొంది. తమ పార్టీలో నెలకొన్న పరిస్థితిని బయటకు రానివ్వకుండా.. కాంగ్రెస్‌ వ్యూహకర్తలు లోలోపడే అసంతృప్తి సెగలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా.. ఎన్నికల నాటికి సిద్ధమయ్యేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఆ దిశ‌గా ఆప్ కూడా వినూత్నంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల బరిలోకి దిగ‌డానికి సిద్ధం అవుతోంది. అందుకే, టీజేఎస్ చీఫ్ మీద క‌న్నేసింది. పార్టీని విలీనం చేసుకోవ‌డంతో పాటు ఆప్ తెలంగాణ పగ్గాల‌ను కోదండ‌రామిరెడ్డికి అప్ప‌గించాల‌ని సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.