Aadhaar: ఆధార్ కార్డు అనేది భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఈ కార్డు లేకుండా ఏ పని జరగదు.. ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చాలా కీలకం. ప్రభుత్వ, ప్రవేట్ రంగం ఏదైనా ఆధార్ కార్డు తప్పని సరి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది. ఆధార్ కార్డును చూపించి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆధార్ కార్డుల్లో రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉండటంతో ఆర్టీసీ సిబ్బంది మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేక పోతున్నారు. దీంతో చాలా మంది మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ కొందరి ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అనే వస్తుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంలో భాగంగా బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు మహిళకు ఆధార్ కార్డులో తెలంగాణ అని లేదుకదా అనే మాట వినిపిస్తోంది. బస్సులో కండక్టర్ కు ఆధార్ చూపినప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని దర్శమిస్తుండటంతో తెలంగాణ అని మార్చుకోవాలి కదా.. ఇలాఉంటే ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించలేం అంటున్నారు. ఉన్నతాధికారులు చెకింగ్‌కు వచ్చిన సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కండక్టర్లు, డ్రైవర్లు మహిళా ప్రయాణికులకు సూచిస్తున్నారు.
పలు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రాలు లేవు. జిల్లా కేంద్రంలో మాత్రమే ఆధార్‌ల కరెక్షన్ చేసేందుకు ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. మహిళలు ఆధార్ సెంటర్‌కు వెళితే.. సరైన ధృవపత్రాలు లేవంటే కార్డులో సవరణలు చేయడం లేదు. నూతన ఓటర్ కార్డు, మీసేవ ద్వారా ధృవీకరించిన రెసిడెన్సి సర్టిఫికెట్ తీసుకువస్తేనే మార్పులకు అవకాశం ఉందని వారు బదులిస్తున్నారు. అన్ని ధ్రువ పత్రాలు తీసుకువెళ్లిన గంటల తరబడి లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఓటరు కార్డులన్ని ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా మార్పులు జరిగాయి. మరి ఆధార్ కార్డులు ఎందుకు అలా రావడం లేదు.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని పలువురు మహిళలు కోరుతున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలు ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం పేరు బదులు ఏపీ రాష్ట్రం అని వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతీ మండలానికి ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి.. ఆధార్ కార్డుల్లో మార్పులు చేయించుకునే అవకాశం కల్పించాలని, అలాకాకుంటే ఆటోమెటిక్‌గా మార్పు అయ్యేలా సంబంధిత యూఐడీఐ సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరించాలని పలువురు మహిళలు కోరుతున్నారు.