Site icon HashtagU Telugu

Gruha Jyothi : ‘గృహజ్యోతి’కి ఆ కార్డు​ తప్పనిసరి.. ఫ్రీ కరెంట్ కావాలంటే ఇలా చేయండి

Gruha Jyothi Scheme

Gruha Jyothi Scheme

Gruha Jyothi : ‘గృహజ్యోతి’ స్కీం కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో  ఆ స్కీంలో అర్హుల ఎంపికకు సంబంధించిన కీలక ఉత్తర్వును  రాష్ట్ర ఇంధనశాఖ జారీ చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. గృహజ్యోతి స్కీం(Gruha Jyothi) ద్వారా ఉచిత కరెంట్‌ పొందాలని అనుకునేవారు ముందుగా బయోమెట్రిక్‌ విధానంలో ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. విద్యుత్‌ సిబ్బంది ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంట్ కనెక్షన్‌ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్‌ కార్డును విద్యుత్‌ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

ఎవరికైనా ఆధార్‌ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని ఆ రుజువును సబ్మిట్ చేయాలి. ఆధార్‌ కార్డు జారీ అయ్యేవరకు ఏదైనా ఇతర గుర్తింపు కార్డు విద్యుత్‌ సిబ్బందికి  అందించాల్సి ఉంటుంది. బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్స్, రేషన్‌ కార్డు, ఎవరైనా గెజిటెడ్‌ అధికారి లేదా తహసీల్దార్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, వీటిలో ఏదో ఒకటి విద్యుత్‌ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలంగాణ ఇంధనశాఖ సూచనలు చేసింది. ఈ సమాచారం ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని డిస్కంలను ఆదేశించింది.

Also Read : Gemini Android App: భార‌త్‌లో గూగుల్ జెమిని యాప్‌.. దీన్ని ఎవ‌రు ఉప‌యోగించాలంటే..?

ఆధార్‌ ధ్రువీకరణ పొందాలంటే బయోమెట్రిక్‌ పరికరాలతో వేలిముద్ర లేదా ఐరిస్‌ స్కాన్‌ చేయాలి. డిస్కంలే ఇందుకోసం ఏర్పాట్లు చేయాలి. పరికరాలు పని చేయకపోతే ఆధార్‌ నంబరును నమోదు చేయగానే, దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే ఆధార్‌ కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వివరాలు తెలుసుకోవాలి. ఇలా అన్ని రకాల ప్రయత్నాలతో ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయాలని డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచనలు చేసింది.

Also Read : Paytm Payments Bank: పేటీఎంకు భారీ ఊర‌ట‌.. మార్చి 15 వ‌ర‌కు గ‌డువు పొడిగించిన ఆర్బీఐ..!