Telangana : గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అలా ప్రమాదకరంగా ప్రయణిస్తుండటంపై ఆరా తీశారు. విచారణ అనంతరం ఆ వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇటీవల కాశీ వెళ్లిన ఆ వ్యక్తి.. ఆయోధ్య వెళ్తుండగా మధ్యలో కొందరు అతడికి గంజాయి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. దీంతో భయపడి గోరఖ్‌పుర్‌లో రైలు ఎక్కినట్లు చెప్పారు. అనంతరం రైలులో కొందరు చంపేస్తాని బెదిరించడంతో.. ఇంజిన్‌పైకి ఎక్కినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
- రైలు ఇంజిన్‌పై యువకుడి ప్రయాణం
- ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మంచిర్యాలకు వచ్చిన యువకుడు
- అదుపులోకి తీసుకున్న జీఆర్పీ పోలీసులు
గోరఖ్‌పుర్ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు #Gorakhpur #Mancherial #Travelled #TrainEngine #BreakingNews #Police #arrest #telangana #HashtagU pic.twitter.com/B3DFOskbwz
— Hashtag U (@HashtaguIn) January 2, 2026
తెలంగాణలోని మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి రైలు ఇంచిన్‌పై ప్రయాణం చేశాడు. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌పై ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మంచిర్యాలకు వచ్చాడు. ఇంజిన్ రెండు బోగీల మధ్య ఉండే ‘కప్లింగ్’ పై ప్రమాదకర రీతిలో కూర్చుని ప్రయాణం చేశాడు. రైలు మంచిర్యాల స్టేషన్‌కు చేరుకోగానే జీఆర్పీ పోలీసులు అతడిని కిందకు దించి.. అదుపులోకి తీసుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. కాగా, ఆ వ్యక్తిని సిద్దిపేట జిల్లా బూరుగుపల్లికి చెందిన 30 ఏళ్ల సడిమెల జయశంకర్‌గా గుర్తించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సడిమెల జయశంకర్ 2025 డిసెంబర్ 28న సికింద్రాబాద్ నుంచి ఓ ప్రైవేటు బస్సులో వారణాసి వెళ్లాడు. అనంతరం 30న అక్కడి నుంచి నుంచి అయోధ్యకు బయలుదేరాడు. ఈ క్రమంలో దారి మధ్యలో కొందరు అతడికి.. గంజాయి, మత్తుపదార్థాలు ఇచ్చారు. దీంతో భయపడిపోయిన జయశంకర్.. వారి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం డిసెంబర్ 31న గోరఖ్‌పుర్‌లో ట్రైన్ ఎక్కి ఇంటికి వస్తున్నట్లు.. సిద్ధిపేటలో ఉన్న కుటుంబసభ్యులకు కాల్ చేసి చెప్పాడు.
కాగా, జయశంకర్‌ను పోలీసులు విచారించకగా.. గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌లో కొంతమంది తనను చంపుతామని బెదిరించినట్లు తెలిపాడు. ఆ భయంతో రైలు ఇంజిన్‌పైకి వెళ్లి దాక్కున్నానని చెప్పాడు. అయితే జయశంకర్ రైలులో వస్తున్నాడని.. అతడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత.. అతడిని పట్టుకుని కిందకు దించారు.
పోలీసుల విచారణలో జయశంకర్ పొంతన లేని సమాధానాలిస్తున్నాడని తెలిసింది. దీంతో అతడు నిజంగా గోరఖ్‌పుర్ నుంచి రైలుపైనే ప్రయాణించాడా.. లేదా మంచిర్యాలకు రాకముందు పైకి ఎక్కాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జీఆర్పీ పోలీసులు అతడి కుటుంబ సభ్యులను పిలిపించి.. జయశంకర్‌ను అప్పగించారు. అయితే కొన్నాళ్లుగా జయశంకర్‌కు మానసిక స్థితి సరిగ్గా లేదని అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడం గమనార్హం.
గతంలో వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్‌లో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. రైలుపైకి ఎక్కి ఓ వృద్ధుడు హల్‌చల్ చేశాడు. హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ పైకి ఎక్కి హైటెన్షన్ వైరు పట్టుకున్నాడు. వైరును తాకీ తాకితకనట్లుగా పట్టుకోవటం.. అదే సమయంలో ట్రైన్ ఒక్కసారి కదలడంతో జారిపోయి కిందపడ్డాడు. దీంతో చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హైటెన్షన్ వైర్లు పట్టుకున్నా.. గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
