Telangana Ministers : ఈ లోక్‌సభ ఎన్నికలు కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే కాదు.. తెలంగాణ మంత్రులకు కూడా ఒక పరీక్షలా మారాయి. ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. గెలిచే అవకాశాలను చేజారనివ్వొద్దని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు అందుతున్నాయి. దీంతో మంత్రులు తమకు పార్టీ కేటాయించిన లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఒకవేళ గెలవాల్సిన చోట ఏదైనా ప్రతికూల ఫలితం వస్తే.. ఎన్నికలయ్యాక దాని ఎఫెక్టు మంత్రుల(Telangana Ministers) పదవులపై ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఓ మంత్రికి ఈవిషయంపై కాంగ్రెస్ పెద్దలు కీలక సూచనలు చేశారని అంటున్నారు. సదరు మంత్రి తనకు కేటాయించిన లోక్‌సభ స్థానం కాకుండా.. మరో లోక్‌సభ స్థానం వ్యవహారంలో తలదూర్చడంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయని చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఎవరా మంత్రి ?
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ సారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల బాధ్యతలు ఇచ్చారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల నల్లగొండ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారంటూ మంత్రి ఉత్తమ్‌తో పాటు జానారెడ్డి నుంచి ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి. నల్లగొండ నుంచి జానారెడ్డి కుమారుడు పోటీ చేస్తున్నారు. అక్కడ కోమటిరెడ్డి జోక్యం అక్కర్లేదని ఏఐసీసీ పెద్దలకు మంత్రి ఉత్తమ్, జానారెడ్డి చెప్పారట. దీంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ పెద్దలు సికింద్రాబాద్‌పైనే ఫోకస్ చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సూచించారట. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. భువనగిరి ఎంపీని గెలిపించాక తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారట. ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో వేచిచూడాలి.
Also Read :Modi Interview With NTV: ఎన్టీవీ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ హైకమాండ్ రివ్యూలు, రిపోర్టులు
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్ధులను గెలిపించే బాధ్యతను మంత్రులకు అప్పగించిన ఏఐసీసీ.. ప్రచారం ట్రెండ్స్, సమన్వయంతో ముందుకు నడుస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులను తెప్పించుకొని సమీక్షిస్తోంది. ఆయా లోక్‌సభ స్థానాలకు పార్టీ నియమించిన ప్రత్యేక పరిశీలకుల నుంచి కూడా ఏఐసీసీకి రిపోర్టులు వెళ్తున్నాయి. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపోటములపై ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రివ్యూ చేస్తోంది. పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారంలో వెనకబడిన అభ్యర్ధుల వేగాన్ని పెంచేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.
సర్వశక్తులు ఒడ్డుతున్న మంత్రులు
- నాగర్ కర్నూల్‌లో ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు చెమటోడుస్తున్నారు. ఇక్కడ మల్లురవికి బీజేపీ అభ్యర్ధి పోతుగంటి భరత్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, క్యాడర్‌తో ప్రతిరోజు మీటింగులు పెట్టుకుంటున్నారు.
- పెద్దపల్లి అభ్యర్ధి గడ్డం వంశీ కృష్ణ గెలుపుకోసం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కష్టపడుతున్నారు. ఇక్కడ వంశీకి కలిసొచ్చే అంశం ఏమిటంటే తండ్రి వివేక్, బాబాయ్ వినోద్ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినా దుద్దిళ్ల శ్రీధర్ బాబు తానే బాధ్యత తీసుకున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన అన్ని రకాల కసరత్తులు చేస్తున్నారు.
- కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రావు చెప్పిన అభ్యర్థికే(వెలిచాల రాజేంద్రరావు) ఈసారి లోక్‌సభ టికెట్ ఇచ్చారు. దీంతో ఆ అభ్యర్థి గెలుపుకోసం పొన్నం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున బండిసంజయ్, బీఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ పోటీ చేస్తున్నారు. గెలుపు అవకాశాలు బండికే ఎక్కువగా ఉన్నాయనే ప్రచారంతో మంత్రి పొన్నంపై ఒత్తిడి పెరుగుతోంది.
- వరంగల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి కడియం కావ్య గెలుపుకు మంత్రి కొండా సురేఖ బాగా శ్రమిస్తున్నారు.
- మెదక్ లో మంత్రి దామోదరరాజనర్సింహ కూడా పార్టీ అభ్యర్ధి నీలంమధు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
- తన సొంత జిల్లా మహబూబ్ నగర్‌లోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్‌సభ స్థానాలతో పాటు గత ఎన్నికల్లో తాను గెలిచిన మల్కాజిగిరి స్థానంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.