Warangal Airport : తెలంగాణలోని వరంగల్‌లో రీజియనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం దిశగా అడుగులు పడతున్నాయి. ఇక్కడ రీజియనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. అయితే అది ఏ స్థాయిలో ఉంటుంది ? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీనిపై తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో వరంగల్ ఎయిర్ పోర్టు విస్తరణకు రూ.1200 కోట్లు ఖర్చవుతాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదించింది. అయితే బీఆర్ఎస్ సర్కారు అంతగా ఖర్చు పెట్టలేమని ఏఏఐకు స్పష్టం చేసింది. కేవలం రూ.500 కోట్ల వరకైతే ఖర్చు పెడతామని.. ఆ బడ్జెట్‌తోనే విమానాల రాకపోకలకు ఏర్పాట్లు చేయాలని ఏఏఐకు తేల్చి చెప్పింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుంది ? గత బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్నే ఫాలో అవుతుందా ? కొత్తగా మరేదైనా నిర్ణయాన్ని తీసుకుంటుందా ? అనేది ఎన్నికల తర్వాత తెలియనుంది.
We’re now on WhatsApp. Click to Join
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ ఎయిర్ పోర్టుకు 253 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే ఏఏఐ అధికారులు తమకు కనీసం 400 ఎకరాలు కావాలని కోరారు. ఒకేసారి రూ.1200 కోట్లతో 400 ఎకరాల్లో వరంగల్ ఎయిర్ పోర్టును(Warangal Airport) నిర్మించడం బెటర్ అంటూ నివేదిక ఇచ్చారు. దీనిపై సమీక్షించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం త్వరలోనే వరంగల్‌లో పర్యటించనుంది. గతంలోనూ ఎయిర్ పోర్టుకు భూమిని కేటాయించినప్పుడు ఏఏఐ అధికారులు ఆ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఇక ఎయిర్ పోర్టు నిర్మాణానికి ముందు.. హైదరాబాద్‌కు చెందిన జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది.