రెహమాన్ స్వరపర్చిన.. తెలంగాణ బతుకమ్మ పాట ఇదే..!

బతుకమ్మ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బతుకమ్మ... తెలంగాణలో ప్రతి పల్లెలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతాయి. కాలం మారుతున్నా.. మన కల్చర్ మారుతున్నా.. బతుకమ్మ తీరుతెన్నులు మాత్రం మారడం లేదు. ఒకప్పుడు పల్లెలకు పరిమితమైన బతుకమ్మ సంబురాలు. నేడు పట్టణాల్లోనూ సైతం వైభవంగా జరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 6, 2021 / 04:19 PM IST

బతుకమ్మ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బతుకమ్మ… తెలంగాణలో ప్రతి పల్లెలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతాయి. కాలం మారుతున్నా.. మన కల్చర్ మారుతున్నా.. బతుకమ్మ తీరుతెన్నులు మాత్రం మారడం లేదు. ఒకప్పుడు పల్లెలకు పరిమితమైన బతుకమ్మ సంబురాలు. నేడు పట్టణాల్లోనూ సైతం వైభవంగా జరుగుతున్నాయి. లోకల్ టు గ్లోబల్ అంటూ విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా అవతరించిన తర్వాత బతుకమ్మ కు ఎక్కడా లేని ప్రాధాన్యం ఏర్పడింది. అయితే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది తెలంగాణ జాగృతి ఓ ప్రత్యేకమైన పాటను విడుదల చేస్తుంది.

తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ పాటకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ఓ స్పెషల్ సాంగ్  “అల్లిపూల వెన్నెల”  రిలీజ్ చేసింది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా.. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించడం విశేషం. ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” గా సరికొత్త సొబగులు అద్దుకుంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు.

తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ఈ పండుగకు “అల్లిపూల వెన్నెల” మరింత శోభను తీసుకొస్తుందని.. ఈ పాటను తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. పాటను విడుదల చేసిన సందర్భంగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ “బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు” తెలుపుతూ ట్విట్ చేశారు. అయితే తెలంగాణ జాగృతి నిర్మించిన ఈ పాట పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బతుకమ్మ పాట అసలు బాగాలేదు’.. అదొక పాట మాత్రమే.. బతుకమ్మ పాట అయితే కాదు.. అని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కేవలం పేరు కోసమే రెహమన్ ను వాడుకున్నారని, ఆ పాటలో ఎక్కడా కూడా తెలంగాణ కల్చర్ కనబడలేదని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.