Free Electricity : తెలంగాణలో వారికి ఉచిత విద్యుత్ లేనట్టే.. ఎవరికి.. ఎందుకు ?

Free Electricity : ప్రతీ ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం కోసం తెలంగాణ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
200 Units Free Electricity

200 Units Free Electricity

Free Electricity : ప్రతీ ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం కోసం తెలంగాణ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ స్కీం కోసం కొంతమందైతే గత కొన్ని నెలలుగా కరెంటు బిల్లులు కట్టడం లేదు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా కరెంటు బిల్లులు చెల్లించడం లేదట. ఇలాంటి వారి కోసం తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కీలక ప్రతిపాదనను తెరపైకి తేనున్నట్లు తెలుస్తోంది. కరెంటు బిల్లుల బకాయిలు చెల్లించిన వారికి మాత్రమే 200 యూనిట్లలోపు కరెంటును ఉచితంగా అందించనున్నట్లు సమాచారం. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు బిల్లుల బకాయిలను మాఫీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు అంటున్నాయి. పాత బకాయిలను జరిమానాతో సహా కట్టిన వారికే ప్రతినెలా 200 యూనిట్లలోపు స్కీమ్‌ను(Free Electricity) వర్తింపజేసే నిబంధనను అమల్లోకి తెచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు రూ.6వేల కోట్ల కరెంటు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో చాలామంది గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఉచిత కరెంటు కోసం 25 లక్షల వరకూ అప్లికేషన్లు వచ్చాయి. ఇక గృహజ్యోతి అప్లికేషన్లు పెట్టుకున్న వారిలో దాదాపు 70 శాతం మంది నెలకు 100 యూనిట్లలోపే కరెంటును వాడుతున్నారని అంచనా వేస్తున్నారు. వారికి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయాలంటే.. ముందుగా వారు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. బకాయిలు చెల్లిస్తే సర్కారీ ఖజానాకు వేల కోట్ల ఆదాయం వస్తుంది. పైగా బకాయిలు ఉండగా.. అలాంటి వారికి ఉచిత విద్యుత్ అమలు చెయ్యడం సాంకేతిక సమస్యలు తెస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే ఈ అంశాలపై రాష్ట్ర సర్కారు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.

Also Read: Bidens Son – Alka Sagar : భారత సంతతి జడ్జి ఎదుటకు బైడెన్ కొడుకు.. ఎందుకు ?

2014 నుంచి ఇప్పటి వరకు విద్యుదుత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ ధరలు వంటి అంశాలు నివేదికలో ఉండాలన్నారు. అధిక ధరతో విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను సైతం వివరించాలని కోరారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తున్నారో వారి వద్ద నుంచే విద్యుత్ కొనాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి సమగ్ర విద్యుత్‌ విధానం లేక ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్‌ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాత సమగ్ర విద్యుత్‌ విధానాన్ని రూపొందిస్తామని ఆయన అంటున్నారు.

  Last Updated: 12 Jan 2024, 10:23 AM IST