Hyderabad Cricket Association: అజరుద్దీన్ కు షాక్.. ప్రక్షాళన దిశగా హెచ్‌సీఏ!

ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని నియమిస్తూ సుప్రీం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Hca

Hca

పాలకవర్గంలో లుకలుకలు, ఆర్థిక అవకతవకలు, మ్యాచ్ ల నిర్వహణలో అక్రమాలు, అవినీతి… ఇలా అనేక అంశాలకు హెచ్ సీఏ (HCA) వేదికగా మారింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు (Supreme Court) ప్రక్షాళనకు ఉపక్రమించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని నియమిస్తూ సుప్రీం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సభ్యుడిగా ఉంటారు.

తీవ్ర ఆరోపణలు

ఇకమీదట హెచ్ సీఏ (HCA) కార్యకలాపాలు ఈ ఏకసభ్య కమిటీనే చూసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ రూపొందించే నివేదికను పరిశీలించిన తర్వాత, తమ తదుపరి చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పుడు అజహరుద్దీన్, ఎంఎల్ జయసింహ, వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman), వెంకటపతిరాజు వంటి ప్రఖ్యాత క్రికెటర్లను అందించిన హైదరాబాద్ సంఘం అంతర్గత కుమ్ములాటలతో క్రికెట్ వ్యవహారాలను పక్కనబెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు ఎంపికలోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

హెచ్‌సీఏకు తలవంపులు

ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలే తప్ప ఆటకు చేసింది శూన్యం అనడానికి పెద్ద ఉదాహరణ రంజీల్లో హైదరాబాద్‌ జట్టు ప్లేట్‌గ్రూ్‌పనకు దిగజారడమే..! తాజా సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓడిన హైదరాబాద్‌.. ఒకే ఒక్క పాయింట్‌ సాధించింది. జట్టు ఎంపిక చూస్తే బయటి వ్యక్తుల ప్రాబల్యం ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. ప్రతి మ్యాచ్‌కూ టీమ్‌లో భారీగా మార్పులు చేస్తూ ఎవరినీ కుదురుకోనీయకుండా చేశారు. అండర్‌-16, 19, 25ల్లో ఆడని ప్లేయర్లకు కూడా టీమ్‌లో చోటుదక్కడంతో ఆటకంటే అవినీతే రాజ్యమేలిందనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. గతేడాది మూడు రోజుల లీగ్‌లు కూడా నిర్వహించలేదు. కేవలం టీ20ల ప్రదర్శన ఆధారంగానే ఎంపికలు చేశారని చెబుతున్నారు. భారత్‌-ఆస్ట్రేలియా టీ20 టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన తొక్కిసలాట హెచ్‌సీఏకు తలవంపులు తీసుకువచ్చింది. దీనిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ సభ్యులు నిర్ణయించినా.. అజర్‌ మాత్రం కుదరదంటూ పంతంపట్టాడు. ఇవన్నీ క్రికెట్ సంఘానికి అవరోధాలుగా మారాయి.

Also Read: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 100 రాములోరి ఆలయాలు!

  Last Updated: 15 Feb 2023, 01:41 PM IST