Site icon HashtagU Telugu

CMRF New Record: సీఎంఆర్‌ఎఫ్‌లో కొత్త రికార్డు.. ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం!

CM Revanth Reddy's visit to Australia is cancelled

CM Revanth Reddy's visit to Australia is cancelled

CMRF New Record: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డు (CMRF New Record) నెలకొల్పారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్‌తో లబ్ధి పొందాయి. 2018 నుంచి 2023 వరకు అయిదేండ్లలో అప్పటి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2400 కోట్ల సాయం అందించింది. అప్పటి ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.480 కోట్లు ఖర్చుపెడితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే రూ.830 కోట్లు సాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

ప్రజలకు ఆపదలు వచ్చినా, విపత్తులు సంభవించినా ఆదుకునేందుకు నేనున్నానంటూ.. అభయ హస్తం అందించారు. ఈ ఏడాది ఇచ్చిన రూ.810 కోట్లలో రూ.590 కోట్లు సీఎంఆర్ఎప్ ద్వారా సాయం అందించటం గమనార్హం. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అవసరమైతే ప్రజా ప్రతినిధుల సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ సాయం అందిస్తుంది. కొన్ని వ్యాధులకు జిల్లా స్థాయిలో అవసరమైన వైద్య చికిత్స సదుపాయం అందుబాటులో లేక హైదరాబాద్ లోని పెద్ద ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో ముందుగానే సీఎం సహాయ నిధిని ఆశ్రయిస్తారు. అటువంటి సందర్భాల్లో నిమ్స్ తో పాటు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి, నిలోఫర్, ఈఎన్ టీ, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్సలకు అయ్యే అంచనా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సీఎం సహాయ నిధి నుంచి సంబంధిత ఆసుపత్రికి ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీ చేస్తుంది.

Also Read: Minister Ponnam: బీఆర్ఎస్‌తో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది నిజం కాదా?: మంత్రి

ఈ ఎల్‌వోసీల జారీలోనూ సీఎం తన ఉదారతను చాటుకున్నారు. ఈ ఏడాదిలోనే 13 వేల మందికి ఎల్ వోసీ లు జారీ చేసింది. సుమారు రూ. 240 కోట్ల ఎల్‌వోసీలు మంజూరు చేశారు. ఇందులో అత్యధికంగా చిన్న పిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, చికిత్సలకు కేటాయించారు. ప్రాణాపాయంలో ఎవరున్నా సరే.. వైద్య చికిత్స అత్యవసరమని గుర్తించిన ప్రజా ప్రభుత్వం ఎల్వోసీల జారీని వేగవంతం చేసింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఎల్వోసీ ఇచ్చే ఏర్పాట్లు చేసింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవద్దని, ఆదివారంతో పాటు సెలవు దినాల్లో కూడా ఎల్‌వోసీలు క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించటం గమనార్హం.

గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులకు కూడా అవినీతి చీడ పట్టుకుంది. పేదల పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులను దిగమింగే దందా వెలుగులోకి వచ్చింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను కూడా ఆన్‌లైన్ లోకి తెచ్చింది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తుదారులే తమ సీఎంఆర్‌ఎఫ్ సాయం ఏ దశలో ఉందో.. ఎప్పటికప్పుడు స్టేటస్‌ను తెలుసుకునేలా ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించారు.

గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పని చేసిన సిబ్బంది సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అటువంటి లొసుగులకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులపై లబ్దిదారుల పేర్లతో పాటు వారి బ్యాంక్ ఖాతా నంబర్‌ను రేవంత్ సర్కారు ముద్రిస్తోంది. హాస్పిటల్స్‌ వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేసి, దొంగ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేయడాన్ని నిరోధించింది. నిజమైన అర్హులకు మాత్రమే సీఎం సహాయ నిధి అందే ఏర్పాట్లు చేసింది.

ఆ పిల్లలకు పునర్జన్మ

పుట్టుకతోనే ఈఎన్‌టీ(మూగ, చెవుడు) సమస్యలతో పుట్టే పిల్లలకు 6 ఏండ్ల లోపల శస్త్రచికిత్సలు చేయించాల్సి ఉంటుంది. అవసరమైన వినికిడి పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. లేకుంటే వారు జీవితాంతం మూగ వారిగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ ఆపరేషన్ల ఖరీదు లక్షల్లో ఉండడంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్నారు. అలాంటి పిల్లలు జీవితాంతం చెవులు వినపడక, మాటలు రాని అభాగ్యులుగా ఉంటున్నారని తొలి సమీక్ష సమావేశాల్లోనే వైద్యారోగ్య శాఖ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది.

స్పందించిన ముఖ్యమంత్రి తెలంగాణలో భవిష్యత్తు తరాల్లో చెవిటి, మూగ పిల్లలు ఉండకూడదని, అటువంటి పరిస్థతి పునరావృతం కాకుండా ఎంత ఖర్చయినా ప్రభుత్వమే అలాంటి పిల్లలకు ఛికిత్సలు చేయాలని ఆదేశించారు. ఎల్‌వోసీలు ఇచ్చి అటువంటి పిల్లలను ఆదుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 87 మంది పిల్లలకు ఎల్‌వోసీ ఇచ్చి ఆపరేషన్లు ఇచ్చారు. ఇది తమ పిల్లలకు రేవంతన్న ఇచ్చిన పునర్జన్మ అని పిల్లల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.