Barrelakka : ప్రభుత్వానికి బర్రెలక్క ప్రమాదం

బర్రెలక్క (Barrelakka)గా ప్రసిద్ధి చెందిన శిరీష అనే యువతి తెలంగాణ ఎన్నికలలో ఇప్పుడు తెలంగాణ యువ సంచలనానికి ప్రతీకగా మారింది.

  • Written By:
  • Updated On - November 23, 2023 / 11:10 AM IST

ఒక ప్రాంతం పోరుగడ్డగా ప్రసిద్ధికి ఎక్కిందంటే, ఆ ప్రాంతం ప్రాంతమంతా పోరుసంద్రమై నింగికెగసిన చారిత్రక సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఒక్కోసారి ఒక వ్యక్తి రూపంలోనే ఆ పోరుగడ్డ మొత్తం పోరాట రూపమై ప్రతిఫలిస్తుంది. పోరాటాల గడ్డగా చరిత్రకెక్కిన తెలంగాణలో ఇప్పుడు ఆ చోద్యమే మనం చూస్తున్నాం. బర్రెలక్క (Barrelakka)గా ప్రసిద్ధి చెందిన శిరీష అనే యువతి తెలంగాణ ఎన్నికలలో ఇప్పుడు తెలంగాణ యువ సంచలనానికి ప్రతీకగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బర్రెలక్క (Barrelakka) మాటే వినిపిస్తోంది. అందరూ బర్రెలక్కకు మద్దతుగా నిలవాలని పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఇక ఎలాగూ ఉద్యోగాలు ఇవ్వలేవని, పరీక్షలు కూడా నిర్వహించలేని నిస్సత్తువలో, నిష్క్రియాపరత్వంలో ప్రభుత్వాలు కూరుకుపోయాయని శిరీషకు అర్థమైపోయింది. నాలుగు బర్రెలు కాసుకొని అయినా బతుకు గడుపుదామని నిర్ణయించుకుంది. అదే విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందింది.

We’re Now on WhatsApp. Click to Join.

అదే, ప్రభుత్వంవారికి కోపం కూడా తెప్పించింది. దాని పర్యవసానమే ఆమె మీద పోలీసుల కేసు. ఇది నేపథ్యం కాగా ఆమె, ప్రభుత్వం చేతగానితనం మీద, నిర్లక్ష్యం మీద తన వ్యతిరేక స్వరాన్ని వినిపించడానికి, ఎన్నికలలో వేదికగా చేసుకుంది. ఈ ఎన్నికలలో కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగింది. ఈ సందర్భంగా యువకులలో ఆమె ధైర్యానికి సాహసానికి జేజేలు పలికే ఉత్సాహం ఉత్తేజం వెల్లువెత్తాయి. ఆమెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు తదితర ప్రజా సంఘాలన్నీ ఆమెకు మద్దతు ప్రకటించాయి. ఆమె ప్రచారం చేసుకోవడానికి పలువురు సహృదయంతో ఆర్థిక సాయం చేస్తున్నారు. తన పట్టణ తాను శిరీష ప్రచారం చేసుకుంటుంటే రోజు రాజుకూ ఆమెకు పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేని రాజకీయ పార్టీలు ఆమెపై దాడికి పూనుకున్నాయి. ఆమె ప్రచారం చేసుకుంటున్న సందర్భంగా శిరీష తమ్ముడు మీద దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ శిరీష మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు మరో సంచలనంగా మారింది. అంతే, ఆమె పట్ల అన్ని మూలల నుంచి సానుభూతి ఉప్పొంగుతోంది.

బర్రెలక్క (Barrelakka)కు రాష్ట్రవ్యాప్త సంఘీభావం:

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ బర్రెలక్క (Barrelakka) తమ్ముడిపై జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని బర్రెలక్కకు రక్షణ కల్పించాలని డిజిపికి ఒక లేఖ రాశారు. అంతేకాదు ఎలక్షన్ కమిషనర్ కు కూడా ఆయన శిరీష భద్రత కోసం లేఖ రాశారు. శిరీష తమ్ముడు పై జరిగిన తాజా దాడిని చూసి సభ్య సమాజం నివ్వెర పోయింది. ప్రజాస్వామ్యం పట్ల, మానవీయ విలువల పట్ల, స్వచ్ఛమైన రాజకీయాల పట్ల ఇంకా ప్రేమ మిగిలిన వారంతా, కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా బర్రెలక్క (Barrelakka)కు మద్దతుగా నిలుస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టిన మారుమూల పల్లెవాసి, నిండా పాతికేళ్లు కూడా లేని నిరుద్యోగ యువతి తాను ఒక్కతే ఒక మహా సైన్యమై పోరాటంలోకి దిగితే, ఇప్పటికే ఎంతో నిస్పృహలో ఉన్న లక్షలాది యువతీ యువకులు చేతులు కట్టుకొని కూర్చుంటారా? వారంతా బస్సు యాత్ర చేస్తూ పెన్షన్ కాదు, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమంటూ రాష్ట్రంలోని పెద్దలను అభ్యర్థిస్తున్నారు. ఇదంతా బర్రెలక్క పోరాట స్ఫూర్తికి మరింత తెగువని ధైర్యాన్ని అందిస్తోంది.

ఈ ఎన్నికలలో బర్రెలక్క గెలిచినా, గెలవకపోయినా అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీల మదపుటేనుగుల్లాంటి అభ్యర్థుల మధ్య ఒక సాధారణ నిరుపేద యువతి సాగిస్తున్న ఈ ఒంటరి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. బర్రెలక్క ఇప్పుడు కేవలం ఒక నామమాత్రపు యువతి కాదు. ఆమె సమస్త తెలంగాణ యువజన హృదయాల రణస్ఫూర్తికి ప్రతీకగా ప్రతాకగా నిలిచింది. క్రమక్రమంగా ఆమె పట్ల ప్రభుత్వం వారు, పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో, దీనికి కారణం ఏమిటో ప్రజలకు అర్థమవుతోంది. ఇది కేవలం కొల్లాపూర్ లో శిరీష కోసం మద్దతుగా నిలవడానికే కాదు, మొత్తం రాష్ట్రమంతా కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు అన్ని ప్రజా సంఘాల వాళ్ళూ ప్రభుత్వ తీరుపట్ల నిరసన వ్యక్తం చేయడానికి నేపథ్యంగా మారింది. బర్రెలక్కపై ఇప్పుడు జరుగుతున్న ఏ దాడి అయినా అది ప్రభుత్వానికి వ్యతిరేక దిశగా మారే ప్రమాదం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఆమె పట్ల వెల్లువెత్తుతున్న సానుభూతి భవిష్యత్తులో ఏ పోరాటానికి పునాది వేస్తుందో ఊహించలేం. మొత్తానికి శిరీష ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రతిపక్షాలను కూడా ఏకకాలంలో గడగడలాడిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వానికి మాత్రం అత్యంత ప్రమాదకారిగా మారింది.

Also Read:  BRS Government : బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూల, ప్రతికూల అంశాలు