Siricilla Railway Bridge : ఏకంగా రూ.332 కోట్ల భారీ బడ్జెట్‌తో పొడవైన రైలు వంతెనను సిరిసిల్ల సమీపంలో మానేరునదిపై నిర్మించబోతున్నారు. ఈ వంతెన దాదాపు 2.4 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంటుంది. కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన రైలు వంతెన చాలా ఫేమస్. అచ్చం దానిలాగే ఇనుప గర్డర్లతో సిరిసిల్ల సమీపంలోనూ రైలు వంతెనను కట్టబోతున్నారట. సాధారణంగా వంతెన మీదుగా రైళ్లు ప్రయాణిస్తే, దానిలో కంపనాలు ఏర్పడతాయి. ఈ కంపనాల ప్రభావం నేరుగా వంతెన పిల్లర్లపై పడుతుంది. ఈ కంపనాల ప్రభావం పిల్లర్లపై పడకుండా సిరిసిల్ల రైల్వే వంతెనను ఇనుప గర్డర్లతో బలంగా నిర్మించనున్నారు. ఈమేరకు డిజైన్‌తో రైలు వంతెన నిర్మాణ ప్రతిపాదనకు ఆమోద ముద్ర లభించినట్లు తెలిసింది. ఈ వంతెన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వంతెన పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలిచింది. సిరిసిల్ల వైపు రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యేనాటికి వంతెన సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 18 నుంచి 20 నెలల్లోగా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు తెలిసింది.
Also Read :Telangana MLC Polls : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కీలక అభ్యర్థులు, ఆశావహులు వీరే
ఎందుకీ వంతెన ?
- మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు అనేది కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో(Siricilla Railway Bridge) నేరుగా అనుసంధానిస్తుంది.
- మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. రైలు సిరిసిల్లకు చేరాలంటే మానేరు నదిని దాటాలి.
- ఇందుకోసం సిరిసిల్ల శివారులో రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. రైలు అక్కడకు చేరుకునే మార్గానికి కేవలం 10 కి.మీ. దూరంలో మిడ్ మానేరు జలాశయం ఉంది. వర్షాకాలంలో ఈ జలాశయంలో నీటి నిల్వ బాగా పెరుగుతుంది.
- మిడ్ మానేరు జలాశయంలో గతంలో నమోదైన గరిష్ట నీటిమట్టాన్ని మించిన స్థాయిలో నీళ్లు చేరినా రైలు మార్గానికి ఇబ్బంది కలగని రీతిలో సిరిసిల్ల సమీపంలో రైలు వంతెనకు డిజైన్ చేశారు.
- మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా సిరిసిల్ల సమీపంలోని గోపాలరావుపల్లి వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమవుతుంది. సిరిసిల్ల వైపు అనుపురం గ్రామపరిధిలో ఈ వంతెన ల్యాండ్ అవుతుంది. 2.4 కి.మీ పొడవునా ఈ వంతెనను నిర్మిస్తారు.
- ప్రయాణికుల రైళ్లు గంటకు 120 కి.మీ.వేగంతో దూసుకుపోయినా ఇబ్బందికాని రీతిలో సిరిసిల్ల రైల్వే వంతెనను నిర్మించనున్నారు. దీనిపై నుంచి సరుకు రవాణా రైళ్లు గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో వెళ్లగలవు.
- ఈ వంతెనను ఆంగ్ల అక్షరం ‘ఎస్’ఆకృతిలో మలుపుతో నిర్మిస్తారు.